ఈసీ విశ్వసనీయత ఆందోళనకరం

14 Apr, 2019 04:20 IST|Sakshi

సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత రోజు రోజుకు తగ్గిపోవడం ఆందోళన కలిగించే పరిణామమని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయస్థాయిలో ప్రతిష్ట కలిగిన ఈ సంస్థ నిష్పక్షపాతంగా ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ తొలిదశ ఎన్నికల నిర్వహణ తీరు అసంతృప్తిని కలిగించిందన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదన్న విమర్శలొచ్చాయని, ఏపీ, తెలంగాణల్లోనూ ఇవి చోటు చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిగిలిన ఆరు విడతల ఎన్నికలనైనా ఈసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శనివారం మఖ్దూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ పదే పదే సైన్యానికి ఓటు అంటూ బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలనే అర్థం వచ్చేలా చేస్తున్న ప్రచారాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించాలన్నారు. 

విపక్షనేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌... 
కలెక్టర్ల వ్యవస్థ, రెవెన్యూ,మున్సిపల్‌ శాఖలపై‡ సీఎం కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉంటున్నాయని చాడ వెంకటరెడ్డి అన్నారు. గతం నుంచి కొనసాగుతున్న కలెక్టర్ల వ్యవస్థే పనికి రానిదనడం సరికాదన్నారు. రెవెన్యూ,మున్సిపాలిటీ శాఖల్లో అవినీతి గత ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు కేసీఆర్‌కు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆయన సీఎం మాదిరిగా కాకుండా ప్రతిపక్షనేత లాగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్‌ మెదడులో ఏదైనా ఆలోచన వచ్చిందే తడవుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. సీఎం ఇష్టానుసారంగా రెవెన్యూశాఖను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీని నిర్వహించడంతో పాటు, నిపుణుల సలహాలను స్వీకరించాలని డిమాండ్‌చేశారు. స్థానిక సంస్థలంటే తనకెంతో విశ్వాసమున్నట్టుగా కేసీఆర్‌ చెబుతున్నారని, నిధులు, విధులు బదలాయించకుండా పంచాయతీలు, మండల పరిషత్‌లను నిర్వీర్యం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు.

మరిన్ని వార్తలు