‘స్వచ్ఛ దర్పణ్‌’లో ఆరు తెలంగాణ జిల్లాలు 

18 Aug, 2019 02:22 IST|Sakshi

దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో  8 జిల్లాలకు ప్రథమ స్థానం

తెలంగాణ నుంచి వరంగల్‌ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌కు పెద్దపీట

కేంద్ర ప్రభుత్వ సర్వే తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్‌ మూడో దశ సర్వేలో తెలంగాణలోని ఆరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్ఛ దర్పణ్‌ ఫేస్‌– 3 ర్యాంకింగ్‌ వివ రాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 700 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. అందులో 8 జిల్లాలకు మొదటి ర్యాంకు దక్కింది. వీటిలో రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలతో పాటు గుజరాత్‌లోని ద్వారక, హరియాణాలోని రేవరీ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. స్వచ్ఛభారత్‌ అమలు తీరుపై అంచనాలకోసం కేంద్రం దశల వారీగా సర్వేలు నిర్వహిస్తోంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే ఫలితాల ఆధారంగా గరిష్టంగా వంద మార్కులు వేస్తారు. పూర్తి స్థాయి మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, నిర్వహణ, కమ్యూనిటీ సోక్‌ పిట్స్, కంపోస్టు పిట్స్, స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలపై అవగాహన పెంచడం, జియో ట్యాగింగ్‌ పరిశీలన వంటి అంశాలపై దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. దేశంలోని ఎనిమిది జిల్లాలకు వందకు వంద మార్కులు వచ్చాయి. వీటిలో మన రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల సంఖ్య 42,33,614గా ఉంది. 2014 వరకు 11,56,286 కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇప్పుడు వంద శాతం లక్ష్యం పూర్తయ్యింది. పెరిగిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా కొత్త మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని కేంద్ర ప్రభుత్వ సర్వేలో నమోదైంది.

మిగతా జిల్లాల్లో అంతంతే... 
ఈ జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లలో 6 జిల్లాలు ప్రథమ స్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్‌ 19, వనపర్తి జిల్లా 20 స్థానంతో సరిపెట్టుకున్నాయి. మిగతా జిల్లాల విషయానికొస్తే... ఖమ్మం–65, మేడ్చల్‌–75, జనగామ–86, గద్వాల–89, మంచిర్యాల–96, మెదక్‌–105, వరంగల్‌ రూరల్‌–108, సిద్దిపేట–143, నాగర్‌కర్నూల్‌–149, మిగతా జిల్లాలు 168 నుంచి 307 మధ్య ర్యాంకింగ్‌లు సాధించగా భూపాలపల్లి –530తో రాష్ట్రం నుంచి చివరిస్థానంలో నిలిచింది.

అందరి కృషితోనే సాధ్యమైంది: ఎర్రబెల్లి 
‘స్వచ్ఛదర్పణ్‌’లో మన రాష్ట్రం మంచి పనితీరు కనబరిచినట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేతో స్పష్టమైంది. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఎనిమిది జిల్లాలు ఉంటే, వాటిలో తెలంగాణలోని ఆరు జిల్లాలు ఉండడం గర్వకారణం. సీఎం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వాటి వినియోగంపై అవగాహన కలి్పంచాం. స్వచ్ఛదర్పన్‌లో తాజా ఫలితాలకోసం పనిచేసిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు , ఎంపీడీవోలు, ఉపాధి హామీ సిబ్బంది, డీఆర్డీఏ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక అభినందనలు’అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు