‘డబుల్‌’ నిర్మాణాల్లో వేగం పెంచండి

5 Jun, 2018 01:51 IST|Sakshi

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ద్వారా 109 ప్రాంతాల్లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. సోమవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాల పూర్తి షెడ్యూల్‌ను అనుసరించి సౌకర్యాలు కల్పించాలని, లక్ష్యాల మేరకు ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

కొత్త కాలనీల్లో టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల మేరకు ప్రతిపాదనలు ఉండాలని కోరారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలలో ప్రత్యక్షంగా పర్యటించి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. డబుల్‌ బెడ్‌ రూం కాలనీలకు సంబంధించి మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, పోలీస్‌ స్టేషన్లు, ఫైర్‌ స్టేషన్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు తదితర సౌకర్యాల కోసం సంబంధిత శాఖలు నిబంధనల ప్రకారం అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.

సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్ధన్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌ రావు, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ భారతి హోళికేరి, డీజీఫైర్‌ సర్వీస్‌ గోపి కృష్ణ, స్పోర్ట్స్‌ యం.డి దినకర్‌ బాబు, సోనుబాలాదేవి, విద్యుత్, హెచ్‌ఎండీఏ, మెట్రోవాటర్‌ వర్క్స్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు