బాలికా విద్యపై స్కేటింగ్‌ యాత్ర

28 Dec, 2018 10:59 IST|Sakshi

బాలికా విద్యపై అవగాహన కల్పించేందుకు స్కేటింగ్‌ యాత్ర  

25వేల మంది విద్యావసరాలకు నిధుల సేకరణ లక్ష్యంగా ప్రారంభం  

100 రోజుల్లో 6వేల కిలోమీటర్లు ∙18వేల మందికి సరిపడా నిధుల సేకరణ  

అంతర్జాతీయ స్కేటింగ్‌ క్రీడాకారుడు ఉప్పలపాటి రానా సామాజిక బాధ్యత  

తోడ్పాటునందించిన ‘టైటాన్‌’

 గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 40శాతం బాలికలు మాత్రమే విద్యనభ్యసించగల్గుతున్నారు.50శాతం పిల్లలు ముఖ్యంగా బాలికలు పదో తరగతికి ముందే స్కూల్‌ మానేస్తున్నారు. ఇలాంటి వివరాలు చదివినప్పుడు కాసేపు చింతిస్తాం. ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొందరే ఈ పరిస్థితిని మార్చాలని ఆలోచిస్తారు. అందుకు ముందడుగు వేస్తారు. అందులో ఒకరే అంతర్జాతీయ స్కేటింగ్‌ క్రీడాకారుడు ఉప్పలపాటి రానా. మహిళలు విద్యావంతులైనప్పుడే భవిష్యత్తు బాగుంటుందని, అందుకు ఏదైనా చేయాలని సంకల్పించిన రానా... బాలికా విద్యపై అవగాహన కల్పించేందుకు 6వేల కి.మీ స్కేటింగ్‌ యాత్రను పూర్తి చేశాడు.

సాక్షి, సిటీబ్యూరో : వైజాగ్‌ చెందిన ఉప్పలపాటి రానా ఈ యాత్రలో భాగంగా 25వేల మంది బాలికల విద్యావసరాలకు అవసరమైన నిధులు సేకరించాలని సంకల్పించాడు. ఈ సంకల్పానికి ‘టైటాన్‌’ కంపెనీ సహకారం తోడైంది. పేద బాలికల విద్య కోసం నిధులు సమీకరించేందుకు ఎకో (ఎడ్యుకేట్‌ టు క్యారీ హర్‌ ఆన్‌వర్డ్స్‌) కార్యక్రమాన్ని చేపట్టిన ‘టైటాన్‌’ రానాకు అన్ని విధాలుగా సహకరించింది. సెప్టెంబర్‌ 5న కర్ణాటకలోని హోసూర్‌లో ప్రారంభమైన ఈ స్కేటింగ్‌ యాత్ర 6 వేల కి.మీ సాగి డిసెంబర్‌ 13న ముగిసింది.  

అందరి సహకారంతో
ఒక పాపకి పుస్తకాలు, బ్యాగ్‌ ఇలా బేసిక్‌గా 3,600 విద్యావసరాలుంటాయని గుర్తించాం. ఆ లెక్కన ఈ యాత్రలో దాదాపు 18వేల మంది బాలికల విద్యకు కావాల్సిన నిధులు సేకరించగలిగాం. దీనికి అందరూ సహకరించకపోతే నిధులు వచ్చేవి కావు. నేను 6వేల కి.మీ స్కేటింగ్‌ పూర్తి చేసేవాడినీ కాదు. మంచి ఉద్దేశానికి చాలా మంది తోడ్పాటునందిస్తారనేది నేనీ జర్నీలో తెలుసుకున్న ముఖ్యమైన విషయం. అయితే ఏదో సాధించాననే దాని కంటే... ఇంత పెద్ద దేశంలో బాలికా విద్యను గుర్తించి, దానికేమైనా చేయాలని ఆలోచించే వాళ్లు ఇంకా ఎవరూ లేరా? అనిపిస్తోంది. ఎందుకంటే 25వేల మందికి సహకారం అందించడంతో ఈ సమస్య తీరిపోదు. ఇంకా ఎంతో మంది అవసరార్థులు ఉన్నారు. అందరూ దీనిపై ఆలోచిస్తేనే బాలికా విద్య సాధ్యమవుతుంది.

ఆ ఆలోచనతోనే... 
‘గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ అక్షరాస్యతా 40శాతమే. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా మన దేశంలో 50శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మాతాశిశు మరణాలు, భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు ఇలా ఎన్నో సమస్యలున్నాయి. దేశంలో ప్రతి 30 నిమిషాలకు ఇద్దలు బాలలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇవన్నీ విని ఊర్కుంటే కుదరదు. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఏదైనా చేయాలి. అదే ఆలోచనతో ఈ యాత్ర చేపట్టాను. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మనకు బాధ్యతలున్నట్లే సమాజం విషయంలోనూ మనకు కొంత బాధ్యత ఉంటుంది. అది సామాజిక సేవగా కాకుండా బాధ్యతగా చేయాలి. మన చుట్టూ ఉన్న వారి విషయంలోనూ మనకు బాధ్యత ఉందని నేను నమ్ముతాను. కేన్సర్‌ అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అందులో నాకు అర్థమైందేమిటంటే 40 ఏళ్లు వచ్చిన తర్వాత మహిళలకు కేన్సర్, ఆరోగ్యం గురించి అవగాహన కల్పించటం కన్నా... చిన్నప్పటి నుంచే విద్యావంతులను చేస్తే అన్ని విధాల మేలు’ అని చెప్పారు రానా.    

76 రోజులు...  
యాత్ర ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించింది. గంటకు 12–15 కి.మీ స్కేటింగ్‌ చేసేవాడిని. ఇక చివరి యాత్ర రోజుల్లో గంటకు 20–25 కి.మీ చేయగలిగాను. రోజుకు సగటున 80కి.మీ చేసేవాడిని. మొత్తం 100 రోజుల యాత్రలో 76రోజులు స్కేటింగ్‌ చేశాను. మిగతా రోజుల్లో నేను ప్రయాణించిన ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ సహా 70 నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. ఎవరైనా నిధులు ఇవ్వాలనుకుంటే  ఠీఠీఠీ.్టజ్టీ్చnఛిౌఝp్చny.జీn/్ఛఛిజిౌ వెబ్‌సైట్‌ ద్వారా అందించొచ్చు. వాటిని ఇంపాక్ట్, నన్హీ కలీ స్వచ్ఛంద సంస్థలు బాలికా విద్య కోసం వెచ్చిస్తాయి.  

మరిన్ని వార్తలు