చదువుతో పాటు.. ఉద్యోగం

18 Jul, 2019 10:48 IST|Sakshi
శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు  

కోర్సులవగానే కొలువులే లక్ష్యంగా

డిగ్రీ విద్యార్థులకు టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణ 

సాక్షి,కరీంనగర్‌ : తరగతి పాఠాలు మాత్రమే సరిపోదు.. కోర్సులు పూర్తికాగానే కొలువులు కొట్టాలంటే ఇంకా లోతైన పరిజ్ఞానం, ఉద్యోగ సాధనాంశాలైన ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు వివిధ నైపుణ్యాలు తోడైతేనే సాధ్యపడుతుంది. కార్పొరేట్‌ కంపెనీలతోపాటు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే వారి అవసరాలకు తగ్గట్టుగా ఉండే విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు.

కార్పొరేట్‌ కంపెనీలు కూడా చదువుతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు పెద్దపీట వేయడంతో నైపుణ్య శిక్షణ తప్పనిసరవుతుంది. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు అందిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని వాణినికేతన్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుంచి 19వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉద్యోగాంశాలపై శిక్షణ, ఓరాకిల్, జావాలపై శిక్షణ అందిస్తున్నారు. 

వివిధ అంశాల్లో శిక్షణ
టాస్క్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైపుణ్య సామర్థ్యాలను పెంచడానికి వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది. ఉద్యోగాలకు  కావాల్సిన కమ్యూనికేషనల్‌ స్కిల్స్, ఇంటర్వూ స్కిల్స్, వ్యక్తిగత నైపుణ్యాలు, మాట్లాడే భాష, గ్రూప్‌డిస్కషన్, రాతపరీక్ష, సాప్ట్‌స్కిల్స్‌తోపాటు వివిధ అంశాలలో శిక్షణ అందిస్తున్నారు. దీంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను పరిక్షించి, వారి కావాల్సిన విధంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. టాస్క్‌తోపాటు కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో బందచర్చలు, జామ్‌తోపాటు పలు అంశాలపై పట్టుకల్పించే విధంగా ప్రయోగాత్మకంగా  శిక్షణ అందిస్తున్నారు.

కోర్సులవగానే ఉద్యోగాలు
విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్, టెక్నికల్‌ స్కిల్స్, పాఠ్యాంశాలపై లోతైన అవగాహనతోపాటు వివిధ అంశాలపై పట్టుంటేనే భవిష్యత్‌లో ఉద్యోగాలు సులభంగా పొందవచ్చు. టాస్క్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓరాకిల్, జావాపై వారం రోజుల శిక్షణ జరుగుతుంది. కోర్సులు పూర్తికాగానే ఉద్యోగాలు సాధించేలా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నాం.
– లక్ష్మీదీపిక, వాణినికేతన్‌ డిగ్రీ,పీజీ కళాశాల కరస్పాండెంట్‌

కొత్త విషయాలు తెలిశాయి
తరగతి గదుల్లో చదివే పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలుంటేనే తొందరగా జాబ్‌లు సాధించవచ్చు. టాస్క్‌ ఆధ్వర్యంలో మాకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. టెక్నికల్‌ స్కిల్స్, జావా, ఓరాకిల్‌లో లోతుగా విశ్లేషణ చేసి చెప్పడంతో వీటిపై పట్టు సాధించవచ్చు. ఇదే కాకుండా కొలువులకు కావాల్సిన అన్ని రకాల నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నారు. 
– ఏ.శ్రీనిధి, డిగ్రీ విద్యార్థిని

మరిన్ని వార్తలు