ఎస్‌ఎల్‌బీసీ ధరలపై అదే సందిగ్ధం

22 Nov, 2014 00:58 IST|Sakshi
ఎస్‌ఎల్‌బీసీ ధరలపై అదే సందిగ్ధం
  • 2010 నుంచే పెంచిన ధరలు ఇవ్వాలన్న కాంట్రాక్టు సంస్థ
  •  జూన్ 2 తర్వాత నుంచే చెల్లిస్తామన్న ప్రభుత్వం
  •  కాంట్రాక్టు సంస్థ కోరినట్టు చెల్లిస్తే సర్కారుపై రూ.250 కోట్ల భారం
  •  మంత్రి హరీశ్ సమక్షంలో పలు పార్టీలు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధుల భేటీ
  • సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ధరల సర్దుబాటు అం శం ఎటూ తేలలేదు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2010 నుంచి ధరల సర్దుబాటును పరిగణనలోకి తీసుకుని రూ.750 కోట్ల మేర చెల్లించాలని ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ కోరగా.. తాము అధికారంలోకి వచ్చినప్పట్నుంచి (జూన్ 2, 2014) అయ్యే ఖర్చులను మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కాంట్రాక్టు సంస్థ కోరిన విధంగా ధరల సర్దుబాటు చేస్తే ఖజానాపై ఏకంగా రూ.250 కోట్ల భారం పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోసారి భేటీ అయి ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించింది.
     
    మేం వచ్చినప్పట్నుంచే ఇస్తాం..

    ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గానికి సంబంధించి అసంపూర్తిగా మిగిలిన మరో 19.8 కిలోమీటర్ల పనులపై గురువారం సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశానికి కొనసాగింపుగా శుక్రవారం మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ నిర్వహించారు. దీనికి  మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎంవీవీఎస్ ప్రభాకర్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

    జయప్రకాశ్ అసోసియేషన్ కాంట్రా క్టు సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు ప్రాజెక్టు పనులు, కాంట్రాక్టరు కోరుతున్న ధరల సర్దుబాటు అంశాలపై చర్చించారు. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.750 కోట్ల మేర ఎస్కలేషన్ చెల్లింపులతో పాటు మరో రూ.150 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా కోరారు.  

    2010 నుంచి స్టీలు, సిమెంట్, ఇంధనల ధరలను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇందుకు ప్రభుత్వంతో సహా అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.  2010 ధరలను పరిగణనలోకి తీసుకొని చెల్లిస్తే ప్రభుత్వంపై అదనంగా రూ.250 కోట్ల మేర అదనపు భారం పడుతుందని వెల్లడించాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన కాంట్రాక్టు సంస్థ కనీసం 2012 నుంచైనా ధరలు చెల్లించాలని కోరింది.  

    ఉమ్మడి ప్రభుత్వంలో జరిగిన జాప్యానికి తమకు సంబంధం లేదని, తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచే పెరిగిన ధరలను చెల్లిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి విపక్ష పార్టీలన్నీ అంగీకారం తెలిపాయి.  మధ్యేమార్గంగా ఓ నిర్ణయానికి రావాలని సూ చించాయి. దీంతో సమావేశం అసంపూర్తిగా ముగిసింది.  రూ.100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేం దుకు ప్రభుత్వం సానుకూలత తెలిపింది. ప్రజలపైభారం మోపకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి  తాటి వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.
     

మరిన్ని వార్తలు