ఊపిరికి భారమాయె

15 Dec, 2019 03:46 IST|Sakshi

అధిక బరువుతో ‘స్లీప్‌ ఆప్నియా’ సమస్య

ప్రతి పదిమంది గురక  బాధితుల్లో ఇద్దరికి..

నిద్రలోనే శ్వాస ఆగిపోయే ప్రమాదం

యశోద ఆస్పత్రి ‘పల్మొ అప్‌డేట్‌’ సదస్సులో వైద్యులు

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణ కాలుష్యానికి తోడు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో శ్వాస సంబంధమైన కొత్త సమస్యలు వెలుగుచూస్తున్నట్లు ప్రముఖ వైద్య నిపుణులు వెల్లడించారు. ఊపిరితిత్తుల కేన్సర్లకూ ఇదే కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రమాదకరమైన స్లీప్‌ ఆప్నియా (నిద్రలో శ్వాస ఆగిపోవడం/ నిద్ర అవ్యవస్థ) బారినపడే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి పదిమంది గురక బాధితుల్లో ఇద్దరు స్లీప్‌ ఆప్నియాతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

శనివారం బేగంపేటలోని హోటల్‌ మ్యారీగోల్డ్‌లో యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ‘పల్మొ అప్‌డేట్‌’ సదస్సు నిర్వహించారు. మలేసియాకు చెందిన డాక్టర్‌ టైసివ్‌ టెక్, వైద్య ప్రముఖులు రితేష్‌ అగర్వాల్, రవీంద్ర మెహతా, దీపక్‌తల్వార్, బీవీ మురళీమోహన్, సుభాకర్, అమితాసేనె, ఆర్‌.విజయ్‌కుమార్, నవనీత్‌సాగర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి సహా పలు ఆస్పత్రులకు చెందిన 500 మంది వైద్యులు హాజరయ్యారు.

శ్వాస సమస్యలకు కారణాలివే..
►ఐటీ, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న యువత డిస్కోలు, పబ్‌ కల్చర్‌ పేరుతో రాత్రి పొద్దుపోయే వరకు బయటే గడుపుతున్నారు.
►మద్యం తాగడం, చికెన్, మటన్‌ బిర్యానీలు ఎక్కువగా తినడం, ఆహారం జీర్ణం కాకముందే నిద్రకు ఉపక్రమించడం వల్ల శ్వాసనాళాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది శ్వాస సంబంధ సమస్యలతో పాటు స్లీప్‌ ఆప్నియాకు కారణమవుతోంది.
►చాలామంది దీన్ని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. స్లీప్‌ ఆప్నియాతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

ఆకస్మిక గుండెపోటు ప్రమాదం
ఆరోగ్యంగా ఉన్న వారు గాఢనిద్రలో నాలుగు నుంచి ఆరుసార్లు మేల్కొంటారు. నగరంలో చాలామంది నిద్రపోయిన అరగంటకే మళ్లీ లేచి కూర్చుంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, మెడ సైజులో తేడా ఉండటమే ఇందుకు కారణం. నిద్రలో బలవంతంగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేసినా ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ మెదడు, గుండెకు చేరడం లేదు. ఇది ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఏర్పడే గురక.. చికాకు, మతిమరుపు, మధుమేహం వంటి కొత్త సమస్యలకూ కారణమవుతోంది. – డాక్టర్‌ నాగార్జున, పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి

జీవనశైలి మార్చుకోవాలి..
వాతావరణ కాలుష్యానికి తోడు మారిన జీవనశైలి వల్ల శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నాయి. దేశంలో పది శాతం మంది ఉబ్బసంతో, ఏటా 3 మిలియన్ల మంది నిమోనియాతో, మరో 2.7 మిలియన్ల మంది పల్మనరి టీబీతో బాధపడుతున్నారు. అంతేకాదు ఏటా లక్ష మంది ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడుతున్నారు. జీవనశైలిని మార్చుకోవడం, మితాహారం తీసుకోవడం, మద్యం, మాంసం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం, వాకింగ్, రన్నింగ్, యోగా చేయడం ద్వారా బరువును నియంత్రించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. – డాక్టర్‌ జీఎస్‌ రావు, మేనేజింగ్‌ డైరెక్టర్, యశోద ఆస్పత్రి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా