గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం...  

10 Sep, 2019 04:00 IST|Sakshi

పంచాయతీరాజ్‌కు స్వల్పంగా నిధుల కోత

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యం పంచాయతీరాజ్‌ శాఖను ఒడిదుడుకులకు గురిచేసింది. బడ్జెట్‌లో ఆ శాఖ కేటాయింపులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రామీణాభివృద్ధికి ఆశాజనకంగా నిధులు కేటాయించినా.. పంచాయతీరాజ్‌ విభాగానికి మాత్రం కోత పడింది. గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్న సర్కారు.. పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ బడ్జెట్‌లో హైలెట్‌. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులతో వీటిని భర్తీ చేయనుంది. గత బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌కు మంచి ప్రాధాన్యత దక్కింది. నీటిపారుదల శాఖ తర్వాత పీఆర్‌కే ఎక్కువ నిధులు కేటాయించింది. ఈసారి ఇరిగేషన్‌కు కూడా నిధుల కత్తెరపడినప్పటికీ, అదేస్థాయిలో ఈ శాఖకు నిరాశే మిగిలింది.

2018–19 బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌కు రూ.15,562 .84 కోట్లను కేటాయించగా, తాజా బడ్జెట్‌లో పీఆర్, గ్రామీణాభివృద్ధికి కలిపి రూ.15,124.89 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పెంచిన ఆసరా పింఛన్ల మొత్తానికి అనుగుణంగా నెలకు రూ.830 నుంచి రూ.850 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. లబ్దిదారులు అందుబాటులో లేకనో, ఇతరత్రా కారణాలతోనో ఇందులో 15శాతం వరకు వెనక్కు వస్తున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద దాదాపు 40 లక్షల మందికి ఈ పింఛన్లు అందుతున్నాయి. పింఛన్ల మొత్తాన్ని పెంచకముందు (రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నపుడు) రూ. 420–450 కోట్ల వరకు వ్యయమయ్యేది. ఆసరాకు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం వాస్తవ లెక్కలకు అనుగుణంగా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారుల అర్హతను 60 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాలేదు. హైదరాబాద్‌ మినహాయించి మిగతా జిల్లాల్లోనే 57 ఏళ్లకు పింఛను పొందేందుకు అర్హులైన వారి సంఖ్య ఆరున్నర లక్షలు ఉంటుందని సమాచారం. 

మరిన్ని వార్తలు