స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌

12 May, 2020 04:56 IST|Sakshi

కరోనా కట్టడిలో భాగంగా పకడ్బందీగా ప్రక్రియ

పబ్లిక్‌ డాటా ఎంట్రీ ద్వారా డాక్యుమెంట్స్‌ వివరాల నమోదు

ఆన్‌లైన్‌లో స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు వెసులుబాటు

భౌతిక దూరం, మాస్కుల వినియోగంలో నిబంధనలు కఠినతరం

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ మినహాయింపుతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన రిజిస్ట్రేషన్‌ శాఖ, స్థిరాస్తుల నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తుదారులకు మరింత వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌తో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు వెళ్లడానికి అనుమతి పత్రం (పాస్‌) సౌకర్యం కూడా కల్పిస్తోంది. స్థిరాస్తి దస్తావేజుల నమోదు కోసం నిర్ణయించుకున్న సమయం ప్రకారం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న సమయంలో సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వెళ్లడానికి పాస్‌ కూడా ఆన్‌లైన్‌లో లభిస్తుంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకునే దరఖాస్తుదారులు ముందుగా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌  registration. telangana.gov.in లో పబ్లిక్‌ డాటా ఎంట్రీ ద్వారా డాక్యుమెంట్స్‌ వివరాలను నమోదు చేసుకోవాలి.

స్థిరాస్తి క్రయవిక్రయదారులు తమ మధ్య గల షరతులు, నిబంధనలను కచ్చితంగా పొందుపరచడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ఆస్తి విలువ ప్రకారం స్టాంప్‌ డ్యూటీని ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు మినహా ఇతర రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్టాంపు డ్యూటీ తదితర సుంకాలను పూర్తిగా ఆన్‌లైన్‌ లో చెల్లించాల్సి ఉంటుంది. క్రయవిక్రయదారులు అనుకూలమైన సమయాన్ని నిర్ణయించుకొని ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అలాగే స్థిరాస్తికి సంబంధించిన ఈసీ, దస్తావేజు నఖలు పత్రాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ కల్పించింది. రిజిస్ట్రేషన్‌ శాఖ  registration. telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి పొందవచ్చు.

ఐదుగురికి మాత్రమే అనుమతి
కరోనా కట్టడిలో భాగంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఒక స్థిరాస్తి డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు కేవలం ఐదుగురు సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. రిజిస్ట్రేషన్‌కు రిజిస్ట్రేషన్‌కు మధ్య కొంత సమయం తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఆస్తిని కొనుగోలు చేసేవారు, అమ్మేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నా.. స్లాట్‌ ప్రకారం ఒకసారి కేవలం ఐదుగురిని మాత్రమే సబ్‌రిజిస్ట్రార్‌ వద్దకు అనుమతించి.. తర్వాత మరో ఐదుగురిని పంపిస్తారు. కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో, రిజిస్ట్రేషన్‌ సంతకాలు, ఫొటోగ్రఫీ సందర్భంగా శానిటైజర్‌ను ఉపయోగించడం తప్పనిసరి. మాస్కులు లేనిదే లోపలికి అనుమతించరు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు