ఎంజీఎం ఆస్పత్రిలో పసిపాప వివాదం

7 Jul, 2019 09:23 IST|Sakshi
శిశువు తల్లి కోటపాటి సోని, కమ్రత్‌

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

ఒకరు కన్న తల్లి.. అక్రమంగా దత్తత తీసుకున్న మరొకరు

సాక్షీ, ఎంజీఎం: పాప ముద్దుగా ఉంది అని ఆడిస్తానని పేర్కొంటూ.. నెమ్మదిగా దగ్గరైన మహిళ మోసం చేసిందని కన్నతల్లి పేర్కొంటుండగా.. వారి కుటుంబసభ్యుల అంగీకారం మేరకే తాను పెంచుకుంటానని చెప్పి చికిత్స పొందే వార్డులో తల్లి స్థానంలో తన పేరు రాయించానని మరో మహిళ పేర్కొంటోంది. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నాలుగు రోజులుగా సాగుతున్న ఈ వివాదం చైల్డ్‌ వెల్ఫేర్‌ ప్రతినిధుల వద్దకు చేరగా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సీకేఎంలో ప్రసవం.. ఎంజీఎంలో చికిత్స..
మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన కోటపాటి సోని, దివాకర్‌ దంపతులకు గత నెల 26న వరంగల్‌ సీకేఎం ఆస్పత్రిలో పాప జన్మించింది. రక్తహీనతతో బాధపడుతున్న బాలింత సోని 30న ఎంజీఎం ఫీమేల్‌ వార్డులో చికిత్స కోసం చేరింది. ఇదే వార్డులో సోని పక్కనే ధర్మసాగర్‌ మండలానికి చెందిన కమ్రత్‌ చికిత్స పొందుతుంది. ఇరువురి మధ్య స్నేహం పెరిగి పాపను కమ్రత్‌ ఆడించసాగింది.

ఇక పాపకు చికిత్స అవసరం కావడంతో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చేందుకు కమ్రత్‌ తీసుకెళ్లింది. అక్కడ శిశువు తల్లి పేరు స్థానంలో కమ్రత్‌ పేరును, పాప పేరును అఫ్రిన్‌గా రాయించింది. మధ్యలో చూసేందుకు సోని వెళ్లగా అసలు తల్లిదండ్రులు వస్తేనే చూడడానికి అనుమతి ఇస్తామని వైద్యులు చెప్పడంతో వివాదం మొదలైంది. కన్నతల్లిని తానేనని చెబుతున్నా వైద్యులు నమ్మని దుస్థితి నెలకొంది. కాగా, సోని దంపతుల అంగీకారం మేరకే పాపను దత్తత తీసుకున్నానని ఖమ్రత్‌ చెబుతుండడం గమనార్హం. చివరకు ఈ వివాదం చైల్డ్‌ వెల్ఫేర్‌ ప్రతినిధుల వద్దకు చేరగా ఎంజీఎం వైద్యుల సహకారంతో చర్చించి పరిష్కరిస్తామని వారు తెలిపారు. అయితే, నాలుగు రోజులుగా జరుగుతున్న వివాదం ఆలస్యంగా బయటకు రావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు