8 ఏళ్లకే 87 సార్లు రక్తం ఎక్కించారు..

10 Jan, 2020 08:19 IST|Sakshi
తలసేమియా వ్యాధితో బాదపడుతున్న హేమంత్, తల్లిందండ్రులు, చెల్లెలితో హేమంత్‌కుమార్‌

తలసేమియాతో బాధపడుతున్న ఎనిమిదేళ్ల హేమంత్‌

ఇప్పటికే 87 సార్లు రక్తం ఎక్కించిన వైనం

శరీరంలో అధికమవుతున్న ఐరన్‌

శాశ్వత పరిష్కారానికి ఆపరేషన్‌ అవసరమంటున్న వైద్యులు     

సాక్షి, అలంపూర్‌: ఆ బాలుడి వయస్సు కేవలం ఎనిమిదేళ్లే.. కానీ, మాయదారి జబ్బు సోకడంతో జీవితానికి ఎదురీదుతున్నాడు.. రక్తపిపాసి తలసేమియా సోకడంతో ఇప్పటికే 87 సార్లు రక్తం ఎక్కించారు.. వ్యాధి శాశ్వత నివారణకు ఆపరేషన్‌ చేయాల్సిందేనని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో  తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.  

మొదటి సంతానమే..   
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్‌దొడ్డికి చెందిన భాస్కర్, లక్ష్మీదేవిల మొదటి సంతానంగా జన్మించిన హేమంత్‌కుమార్‌కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉండటం వల్ల శరీరంలో రక్తం పెరగదు. దీంతో తల్లిదండ్రులు బాబుకు ఏడాదిన్నర వయస్సు నుంచి వైద్యుల సూచన మేరకు నిర్ణీత రోజులకొకసారి రక్తం ఎక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ చిన్నారి బాబుకు 87 సార్లు రక్తం ఎక్కించారు.

ఇలా ఎక్కువగా రక్తం ఎక్కించడం వల్ల శరీరంలోని ప్రతి అవయవంలో ఐరన్‌ ఎక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే బాబుకు అవయవాల్లో ఐరన్‌ ఎక్కువ కావడంతో, దాని కోసం కూడా మందులు వాడుతున్నారు.

బాబు కోసం గ్రామం వదిలి..
తమ కొడుకును కాపాడుకునేందుకు తల్లిదండ్రులు మారుమూల గ్రామం మాన్‌దొడ్డి నుంచి జడ్చర్లకు తమ నివాసాన్ని మార్చారు. తండ్రి భాస్కర్‌ ప్రైవేట్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆస్పత్రిలో వైద్యం తీసుకునేందుకు, హైదరాబాద్‌ వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి దగ్గరవుతుందని జడ్చర్లలోనే ఉంటున్నామని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు.

బాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యకు ఆపరేషన్‌ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అందుకు రూ.10 లక్షల అవసరం కాగా.. ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామని, కడుపు కట్టుకుని రూ.2 లక్షలు పోగు చేసుకున్నామని, మిగతా డబ్బును దాతలు ఎవరైనా అందిస్తే తమ కుమారుడికి నిండు జీవితాన్ని అందించినవారవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం చేయదలిచిన వారు 8985548806 గూగుల్‌ పే నంబర్‌ ద్వారా, స్టేట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ 32383343535 శాంతినగర్‌ శాఖ ద్వారా కానీ సహాయం చేయాలని, పూర్తి వివరాలకు సెల్‌ నం. 85550 40715ను సంప్రదించాలని హేమంత్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు