పిట్ట గుడ్లు కావు.. కోడిగుడ్లే!

22 Dec, 2017 12:08 IST|Sakshi

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నసైజు గుడ్లు

ఒక్క బుక్కకు చాలవంటున్న తల్లిదండ్రులు

పెద్దపల్లి: పక్క ఫొటో చూశారా? అరచేతిలో 9 కోడిగుడ్లు కనిపిస్తున్నాయి. చాలా మంది పిట్టగుడ్లుగానే భావించొచ్చు.. కానీ అవి కోడిగుడ్లే. అంగన్‌వాడీ కేంద్రాల్లో కాంట్రా క్టర్‌ సరఫరా చేస్తున్న గుడ్లు ఒక్క బుక్కతో నమలకుండానే మింగే సైజులో ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిట్టగుడ్డు మాదిరిగా చిన్నగా ఉన్న కోడిగుడ్లు ఇస్తున్నారు. జిల్లాలోని 305 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చిన్న పిల్లల కోసం  కాంట్రాక్టర్‌ ద్వారా గుడ్లను సరఫరా చేస్తోంది.

భోజనంతోపాటు చిన్న పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ఒక కోడిగుడ్డును అందిస్తున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండం ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గత కొద్ది రోజులుగా చిన్నసైజు గుడ్లను కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తున్నట్లు అంగన్‌వాడీ టీచర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐడీసీఎస్‌ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారంటున్నారు. కాంట్రాక్టర్‌ సీల్‌ టెండర్‌ ద్వారా గతంలో రూ.3కే ఒక కోడిగుడ్డు అందిస్తామంటూ టెండర్‌ పొందాడు. ఈ మేరకు సదరు కాంట్రాక్టర్లు అంగన్‌వాడీ కేంద్రానికి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు.

రిటేల్‌ కోడిగుడ్లకు రూ.6: రెండేళ్ల క్రితం టెండర్‌ ద్వారా రూ.3కే కోడిగుడ్లను సరఫరా చేస్తామని కాంట్రాక్ట్‌ పొందిన వారు ప్రస్తుతం ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఎదురవుతున్న నష్టాల నుంచి బయట పడేందుకు చిన్న సైజు కోడిగుడ్లను తెప్పిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికారులు ఈ విషయాన్ని గమనించి అక్కడక్కడ కాంట్రాక్టర్‌లకు వెసులుబాటు కల్పించడంతో కొన్నిచోట్ల చిన్నసైజు కోడిగుడ్లనే అంటగడుతున్నట్లు తెలిసింది. అయితే అంగన్‌వాడీ కేంద్రాల్లో పలువురు తల్లులు చిన్నసైజు కోడిగుడ్లను సాక్షికి చూపిస్తూ ఇది ఒక్క బుక్కకు కూడా సరిపోదని, అలాంటప్పుడు కోడిగుడ్లను అం్దదించడం దేనికని ప్రశ్నిస్తున్నారు.

చిన్న సైజు గుడ్లను తిరస్కరించండి – సుభద్ర, సీడీపీవో, పెద్దపల్లి
అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నసైజు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు అక్కడక్కడ తమ దృష్టికి తెచ్చారు.దీనిపై అధికారులు స్పందిస్తూ అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. చిన్నసైజు కోడిగుడ్లు తెచ్చిన కాంట్రాక్టర్‌ల నుంచి తీసుకోవద్దని, వాటిని తిరస్కరించాలని సూచించాం. అంగన్‌వాడీ టీచర్లు దీనికి బాధ్యులవుతారు.

మరిన్ని వార్తలు