చిన్నారిని చిదిమేసిన కారు

3 Jul, 2019 09:35 IST|Sakshi
అంత్యక్రియలు నిర్వహిస్తున్న గ్రామస్తులు

28 రోజుల శిశువు మృతి

ముందువెళ్తున్న ఆటోను ఢీకొన్న వైనం

సాక్షి, మంచిర్యాల: అతివేగంగా వచ్చిన కారు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ముందువెళ్తున్న ఆటోను ఢీకొని ఓ చిన్నారిని చిదిమివేయగా.. ఆమె తల్లిదండ్రులను ఆసుపత్రి పాలుచేసింది. కనీసం తల్లిదండ్రుల చివరిచూపునకు నోచుకోని ఆ చిన్నారికి గ్రామస్తులే అన్నీతామై అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషాదకర సంఘటన లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట సమీపంలో చోటుచేసుకుంది.

ఎస్సై మధుసూదన్‌రావు కథనం ప్రకారం.. పాతకొమ్ముగూడెం గ్రామానికి చెందిన బియ్యాల మనోహర్‌ తన తల్లి శాంతవ్వ, భార్య సునీత, కుమారుడు భుమన్‌వర్మ, కూతురు అమ్ములు (28 రోజులు)తో కలిసి సోమవారం దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి వెళ్లారు. మొక్కులు చెల్లించుకుని రాత్రివరకు అక్కడే ఉన్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఇంటికి ఆటోలో బయల్దేరారు. వెంకట్రావుపేట గ్రామ స్టేజీవద్దకు రాగానే.. జన్నారం వైపు వెళ్తున్న కారు ఆటోను వెనుకనుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది.

అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా కిందపడిపోవడంతో అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనోహర్‌కు చేయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అమ్ములు ఆటోలోనే చనిపోయింది. గాయపడిన ఆటో డ్రైవర్‌ సత్యనారాయణతోపాటు మిగిలిన వారిని స్థానికులు 108 సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అమ్ములు శవాన్ని మార్చురీలో భద్రపర్చారు. 

గ్రామస్తుల సాయంతో అంత్యక్రియలు..
కుటుంబ సభ్యులందరూ కరీంనగర్‌లో చికిత్స పొందుతుండగా.. వారిని చూసేందుకు బంధువులు ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే సమయం దాటిపోతుండడంతో మనోహర్‌ బాబాయి (అమ్ములుకు తాత) బియ్యాల లచ్చన్న గ్రామస్తుల సహకారంతో అమ్ములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. తల్లి దండ్రులు చిన్నారి చివరి చూపునకు సైతం నోచుకోలేదు.

శోకసంద్రంలో తల్లిదండ్రులు
అమ్ములు చనిపోయిందన్న విషయం తెలుసుకుని మనోహర్, సునీత దంపతులు ఆసుపత్రిలో రోదించిన తీరు పలువురిని కలచివేసింది. కనీసం తమ బిడ్డను చివరిచూపు చూడలేకపోయామే.. అని కంటతడి పెట్టారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

మరిన్ని వార్తలు