బతుకులు కుదేలు!

30 Jun, 2014 00:41 IST|Sakshi

వికారాబాద్, చేవెళ్ల పట్టణాల్లో జిరాక్స్ సెంటర్లు, ఆన్‌లైన్  సెంటర్లు, వెల్డింగ్ షాపులు, ఫొటో స్టూడియో ల్యాబ్‌లు, వడ్రంగి షాపులు తదితర విద్యుత్‌తో నడిచే చిన్న పరిశ్రమలు కుదేలవుతున్నాయి. పగటిపూట 8 గంటల కోత విధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అంతకుమించే సరఫరా ఉండడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. సింగిల్‌ఫేజ్ సరఫరా కూడా నిలిపివేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని గృహ వినియోగదారులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం. 12 గంటల విద్యుత్ కోతను విధిస్తున్నారు. అంటే పగలు అసలే విద్యుత్ సరఫరా ఉండదన్నమాట.
 
7 గంటలు ఒట్టిమాట
రైతులకు వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు సరఫరా చేస్తున్నామన్న ప్రభుత్వం ఇటీవల కాలంలో 6 గంటలకు తగ్గించింది. కానీ ఆరు గంటలు కూడా విద్యుత్ సక్రమ సరఫరా కావడంలేదని రైతులు వాపోతున్నారు. నాలుగు నుంచి ఐదు గంటలే విద్యుత్ సరఫరా అవుతున్నదని వారు పేర్కొంటున్నారు. ఇటు వర్షాలు పడక, అటు అటు విద్యుత్ కోతతో వ్యవసాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసైనా సరే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
తాగునీటి తిప్పలు
గ్రామాల్లో మంచినీటి బోరుమోటార్లు కరెంట్ కోతతో పనిచేయడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తాగునీటి ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఉదయం పూట కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు, పాఠశాల విద్యార్థులకు ఆలస్యమవుతోంది. రాత్రి వేళల్లో కరెంట్ లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.
 దీంతో ప్రజలు దోమల బెడదతో బాధపడుతున్నారు. విద్యుత్ కోతలపై అధికారులను అడిగితే కోతలుపై నుంచే ఉన్నాయని పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు