'ఈ' జర్నీ మేలు

14 May, 2020 08:14 IST|Sakshi

లాక్‌డౌన్‌ అనంతరం  ఈ–సేల్స్‌పై దృష్టి

ఇక చిరు వ్యాపారాలు సైతం ఆన్‌లైన్‌ బాట

జాబితాలో వస్త్ర, టాయ్స్‌ సహా పలు దుకాణాలు

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీలతో కలిసి జర్నీ

వినియోగదారుల అభిరుచి మారడం, కోవిడ్‌ కలకలమే కారణం

షాపిఫై ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అంచనా..

కోవిడ్‌ నేర్పిన పాఠాల నేపథ్యంలో ఇక నుంచి చిరు వ్యాపారాలు సైతం ఆన్‌లైన్‌ బాట పట్టనున్నాయి. వినియోగదారులు తమ ఇంటి నుంచే తమకు నచ్చిన.. మనసుకు మెచ్చిన వస్త్రాలు, బొమ్మలు, వజ్రాభరణాలు తదితరాలను ఒక్క క్లిక్‌తో ఆర్డర్‌ వేయడం.. ఈ ఆర్డర్లను స్వీకరించిన చిన్న దుకాణాల వారు సైతం నిమిషాల్లో కస్టమర్ల ఇంటికి డోర్‌ డెలివరీ చేయడం ఇట్టే జరిగిపోనుంది. ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ షాపిఫై సంస్థ వినియోగదారుల అభిరుచిపై తాము చేసిన తాజా అధ్యయన వివరాలను వెల్లడించింది.

సాక్షి, సిటీబ్యూరో: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలీబాబా తదితర సంస్థలు కొన్నేళ్లుగా వినియోగదారులు కోరిన పలు నిత్యావసరాలు, రోజువారీగా ఉపయోగించే వస్తువులను వినియోగదారులు ఆర్డరు చేసిన గంటలు.. రోజుల్లోనే డెలివరీ చేస్తుండగా.. ఇప్పుడు మన వీధి చివర్లో ఉండే చిన్న వస్త్ర దుకాణాలు, జువెలరీ దుకాణాలు, చిన్నారులు ఆడుకునే వస్తువులు విక్రయించే స్టోర్లు సైతం ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ నిర్వహించే ఈ–కామర్స్‌ సైట్లతో చేతులు కలపక తప్పని పరిస్థితి రానుంది. కోవిడ్‌ కలకలం, ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంతోపాటు వినియోగదారులు ఒక్కసారిగా ఆయా దుకాణాలకు వెళ్తే భౌతిక దూరం పాటించడం కష్టతరం కానుండటంతో తమ రూటు మార్చుకోక తప్పదని ఈ సంస్థ తెలిపింది. ఇప్పటికే మన నగరంతోపాటు దేశవ్యాప్తంగా సుమారు 20కిపైగా ఈ కామర్స్‌ సైట్లు తమ వ్యాపారాలను నిర్వహిస్తుండగా.. ఇక నుంచి మన వీధి చివర్లో ఉండే దుకాణాలు, ప్రముఖ ప్రాంతాలు, కూడళ్లలో ఉండే దుకాణాల వారు సైతం ఇదే బాటపట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు గుండు పిన్ను దగ్గరి నుంచి రోజువారీగా కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, పాదరక్షలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఒకేచోట విక్రయించే మాల్స్‌కు సైతం జనం తాకిడి కోవిడ్‌ అలజడి పోయే వరకు అంతంతగానే ఉండే అవకాశాలు ఉంటాయని తెలిపింది. 

ఈ తాజా ట్రెండ్‌తో గల్లీ దుకాణమైనా.. ఢిల్లీలో ఉండే ప్రముఖ బ్రాండ్‌ వస్తువులను విక్రయించే సంస్థ అయినా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ మినహా ఇతర ప్రత్యామ్నాయం లేకపోవడం గమనార్హం. నెటిజన్లుగా మారిన గ్రేటర్‌ సిటీజన్లు ఒక్క క్లిక్‌తో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే ట్రెండ్‌ ఇప్పటికే కొనసాగుతుండగా.. తాజా పరిణామలతో మరింతగా ఈ–కామర్స్‌ వ్యాపారం పుంజుకోనుంది. పండగలు, ఇతర ప్రత్యేకమైన రోజుల్లో ఈ ట్రెండ్‌ మరింత విస్తరించనుందని ఈ అధ్యయనం తెలపడం విశేషం. ఈ ఏడాది చివరి వరకు చిన్న వ్యాపారాల ఆన్‌లైన్‌ వ్యాపారం ట్రెండ్‌ జోరందుకుంటుందని అంచనా వేసింది.

చిన్న దుకాణాల ఆన్‌లైన్‌బాట..
ఇప్పుడు చిన్న దుకాణాలు, వ్యాపారాలు నిర్వహించే వారు సైతం ఆన్‌లైన్‌ బాట పట్టక తప్పని పరిస్థితి. ప్రధానంగా వస్త్ర దుకాణాలు, బోటిక్స్, వెండి, బంగారు వజ్రాభరణాలు విక్రయించేవారు, గృహవినియోగ వస్తువులు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, పాదరక్షలు, వాచీలు, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, వినియోగించే స్టేషనరీ, ఇతర బుక్స్, నిత్యావసరాలు, ఆర్గానిక్‌ వస్తువులు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఇతర తినుబండారాలు, బియ్యం, కూరగాయలు ఇలా ఒక్కటేమిటి.. అన్నిరకాల దుకాణాల యజమానులు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫారమ్స్‌తో చేతులు కలపడం లేదా.. సొంతంగా తమ వ్యాపారానికి సంబంధించిన సైట్‌ క్రియేట్‌ చేసి తమ వద్ద అందుబాటులో ఉన్న వస్తువులను అందమైన ఫొటోలు తీసి సరసమైన ధరలకు, ఆఫర్లతో ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచక తప్పని పరిస్థితి నెలకొంది. తమ సైటు గురించి సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ గ్రూపుల్లో ప్రచారం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొందని ఈ అధ్యయనం వెల్లడించింది. కాగా ప్రధాన ఈ–కామర్స్‌ సైట్లు బ్రాండెడ్‌ వస్తువులు, వాటి మార్కెటింగ్, డెలివరీకి భారీగా ఫీజులు వసూలు చేయనున్న నేపథ్యంలో చిన్న వ్యాపారులు సొంతంగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ చేసుకునేందుకు పలు స్టార్టప్‌ ఈ–కామర్స్‌ సైట్లతో చేతులు కలిపే అవకాశం ఉందని.. లాక్‌డౌన్‌ అనంతరం ఈ రంగంలో చిన్న స్టార్టప్‌లు వేలాదిగా పురుడు పోసుకుంటాయని అంచనా వేయడం విశేషం. 

మరిన్ని వార్తలు