కబ్జా కోరల్లో చిన్న నీటి వనరులు

27 Sep, 2014 00:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు, సాగునీటి రంగంలో సమూల మార్పులకు సర్కారు శ్రీకారం చుడుతుంటే.. కబ్జాదారులు జిల్లాలో చెరువులను చెరబడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, పరిసర ప్రాంతాల్లోని చెరువులను కబ్జా చేస్తున్నారు. పట్టణాలు అభివృద్ధి చెందుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. తెల్లారేసరికి భారీ భవంతులు దర్శనమిస్తున్నాయి. చెరువు శిఖం భూములనే కాదు.. రైత్వారీ పట్టాలను చూపి ఏకంగా చెరువు భూముల్లోనే భారీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు.
 
కళ్లముందే కట్టడాలు కొనసాగుతుంటే రెవెన్యూ అధికార యంత్రాంగం, నీటి పారుదల శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని బోగస్ పత్రాలు సృష్టించి కబ్జాదారులు తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఈ కబ్జాల వ్యవహారాల్లో అన్ని పార్టీల నేతలతోపాటు, కొందరు అధికారుల ప్రమేయం కూడా ఉండటంతో ఈ కబ్జాల తొలగింపుపై సర్కారు తీసుకున్న నిర్ణయం అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటు సర్కారే కాదు.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా చెరువు భూముల్లోని అక్రమ కట్టడాలను తొలగించాల్సిందేనని ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆక్రమణల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
150 చెరువులు కబ్జా
జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రకారం చిన్న, పెద్ద చెరువులు కలిపి 1,870 వరకు ఉన్నాయి. నిర్మల్ ధర్మసాగర్ చెరువు మాదిరిగా సుమారు 150కి పైగా చెరువులు కబ్జాలకు గురై ఏకంగా ఆనవాళ్లే కోల్పోయినట్లు ఇటీవల అధికారులు చేపట్టిన సర్వేలో ప్రాథమికంగా తేలింది. ఈ నివేదిక సర్వే చేసిన అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. నీటిపారుదల, రెవెన్యూ, డ్వామా, అటవీ, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సమన్వయంతో ఈ సర్వే జరుగుతోంది.
 
ఆనవాళ్లు కోల్పోయిన చెరువుల్లో కొన్ని..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే మావల చెరువులో కూడా అక్రమ కట్టడాలు వెలిశాయి. గతంలో జాయింట్ కలెక్టర్ ఈ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేసినా ఆక్రమణల తొలగింపు అటకెక్కింది. పైగా ఈ చెరువు శిఖం భూముల్లో ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లే వెలిశాయి. అలాగే ఖానాపూర్ చెరువు కూడా కబ్జాకోరల్లో చిక్కుకుంది.
     
నిర్మల్ పట్టణ పరిసరాల్లో కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులైన కంచరోణి, పల్లె, మంజులాపూర్, సూరన్నపేట చెరువులు కుచించుకుపోయాయి. ఈ భూముల్లో ప్లాట్లు వెలిశాయి. అక్రమార్కులు ఈ భూముల్లో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు.

జిల్లాలోనే అత్యధికంగా మంచిర్యాలలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. రాముని చెరువు భూ ములనైతే బడాబాబులు చెరబట్టారు. ఈ అక్రమ కట్టడాల్లో అన్ని పార్టీల నేతలతోపాటు, జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులకు కూడా ప్లాట్లు, భవనాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే పోచమ్మ చెరువు, సాయికుంట, చీకటి వెలుగుల చెరువు ఇలా పలు చెరువులు రియల్ ఎస్టేట్ వెంచర్లు అక్రమంగా వెలిశాయి. ఇవన్నీ కళ్లముందు కనిపిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

పట్టణాల్లోనే కాదు.. చిన్న, సన్నకారు రైతుల భూ ములకు సాగునీటిని అందించే గ్రామీణ ప్రాంతాల్లో ని చెరువులు కూడా కబ్జాదారుల పరమయ్యాయి. ముఖ్యంగా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీ ల్లోని చెరువులు కూడా అక్రమార్కుల పరమయ్యా యి. సర్కారు హడావుడి కొద్ది రోజులకే పరిమితమవుతుందా.. కబ్జాలను, అక్రమ కట్టడాలను తొలగిం చి చెరువులను చెరవిడిపిస్తుందా వేచి చూడాలి.

మరిన్ని వార్తలు