‘స్మార్ట్’ ఖమ్మంపై ఆశలు

16 Oct, 2014 04:29 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ సిటీల జాబితాలో ఖమ్మానికి చోటుదక్కాలని నగర ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. రూ.కోట్ల నిధులతో నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర తీసుకుంటున్న ఈ కార్యక్రమంలో ఖమ్మంకు అవకాశం వస్తే నగర రూపు రేఖలే మారనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంను కూడా స్మార్ట్ సిటీల జాబితాలోకి చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ప్రకటించడంతో నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మంఅర్బన్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విలీనం చేయడంతో 2012లో ఖమ్మం కార్పొరేషన్‌గా ఏర్పడింది. మూడు లక్షల పై చిలుకు జనాభాతో 50 డివిజన్లను చేశారు. అయితే కార్పొరేషన్ హోదా పెరిగినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఖమ్మానికి నిధులు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

నిత్యం పెరగుతున్న జనాభాకు తగిన మంచినీటి సరఫరా లేక, డ్రైనేజీ వ్యవస్థ అస్తవస్థంగా ఉంది. రోడ్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోతున్నారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులు కూడా తక్కువే. కార్పొరేషన్ స్థాయిలో వసతులు లేకపోవడంతో ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ చందంగా నగరం పరిస్థితి తయారైంది. ఖమ్మాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చితే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనుంది. ఈ ఉద్దేశంతో ఈ జాబితాలో నగరాన్ని చేర్చాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు.
 
* ప్రస్తుతం నగరంలో 71 మురికివాడల్లో 66, 918 మంది జనాభా ఉన్నారు. వీరిలో 15 వేల మందికి కూడా మంచినీటి సరఫరా కావడం లేదు. 42 కుటుంబాలు ఉన్నా కేవ లం 24,500 ఇళ్లకే మంచినీటి కనెక్షన్లు ఉన్నా యి. నగర శివారు ప్రాంతాల వాసుల కు ఇప్పటికీ మంచినీటి సమస్య తప్పడం లేదు.
* నగరం కార్పొరేషన్ అయినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మాత్రం లేదు. చిన్నపాటి వర్షానికే మామిళ్లగూడెం, బస్టాండ్ సెంటర్, కస్పాబజార్, మార్కెట్ ప్రాంతం చెరువులను తల పిస్తున్నాయి. నగరవ్యాప్తంగా ప్రస్తుతం 397 కి.మీ మేర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మురుగు నీరంతా నగరం నుంచి పంపించాలంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థే శరణ్యం.
* నగరం నిత్యం రద్దీ కేంద్రంగా మారింది. ఇటు హైదరాబాద్, అటు విజయవాడ, వరంగల్ వెళ్లేందుకు సెంటర్‌గా ఉండటంతో నిత్యం ప్రయాణీకుల ప్రాంగణంగా  నగరం మారింది. దీనికితోడు వాహనాల సంఖ్య పెరగడం.. రోడ్ల విస్తరణ లేకపోవడంతో నగరం అంతా ఎక్కడ చూసినా ట్రాఫిక్.
* ఇక నగర వాసులకు ఆహ్లాదం అందనిద్రాక్షే. ఆహ్లాదాన్ని పంచే పార్కులు వెళ్లమీద లెక్కబెట్టవచ్చు. గ్రీన్ బెల్టు స్థలాలు అన్యాక్రాంతం కావడంతో కాలుష్య కోరల్లోకి నగరం వెళ్లుతోంది.

 స్మార్ట్ సిటీ అయితే ఇలా..
* కేంద్రం నుంచి మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరువుతాయి.
* అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ జరిగి నగరం సుందరీకరణ సాధ్యమవుతుంది.
* సెంట్రల్ లైటింగ్, ప్రధాన కూడళ్లలో విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి.
* అర్హులైన నగర వాసులందరికీ ఇళ్ల స్థలాలు రానున్నాయి.
* మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటి సరఫరా కానుంది.
* నగరంలో నివసించే పౌరులందరికీ నగర పాలక సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో సేవలు అందించడం స్మార్ట్ సిటీ ఉద్దేశం.

మరిన్ని వార్తలు