మెట్రో స్టేషన్లలో స్మార్ట్‌ పార్కింగ్‌ 

11 Jul, 2018 00:51 IST|Sakshi
నగరంలోని మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న స్మార్ట్‌ పార్కింగ్‌ సముదాయాలు

     24 స్టేషన్లలో రూ.8 కోట్లతో స్మార్ట్‌ పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం 

     మియాపూర్‌–అమీర్‌పేట్‌–నాగోల్‌ రూట్లో ఏర్పాటు..

     దశలవారీగా అన్ని మెట్రో స్టేషన్లలో ఏర్పాటుకు హెచ్‌ఎంఆర్‌ యత్నం

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో నగరవాసుల పార్కింగ్‌ కష్టాలు తీరనున్నాయి. మెట్రో స్టేషన్లలో ‘పార్క్‌ హైదరాబాద్‌’పేరుతో అధునాతన స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఆధారంగా మియాపూర్‌–అమీర్‌పేట్‌–నాగోల్‌ (30 కి.మీ) మార్గంలోని 24 మెట్రో స్టేషన్ల వద్ద ఈ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.8 కోట్లతో ‘జృతి సొల్యూషన్స్, ఎగైల్‌ పార్కింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’సంయుక్త ఆధ్వర్యంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను సైతం 20 ఏళ్లపాటు ఈ రెండు సంస్థలే నిర్వహిస్తాయి. ఇందుకుగాను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సంస్థకు రూ.ఏడు కోట్ల పార్కింగ్‌ లైసెన్సు ఫీజును ఆయా సంస్థలు చెల్లించినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 

మొబైల్‌ యాప్‌తో పార్కింగ్‌ ప్లేస్‌ బుకింగ్‌.. 
ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థలో మీ వ్యక్తిగత ద్విచక్రవాహనం లేదా కారును పార్కింగ్‌ చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని మొబైల్‌ యాప్‌ ద్వారా నూ బుక్‌ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సమయంలో ఆయా స్టేషన్ల వద్ద పార్కింగ్‌ స్థలం అందు బాటులో ఉందా..? లేదా..? అన్న విషయాన్ని సైతం ఈ యాప్‌ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. స్థలం అందుబాటులో ఉంటే మీ వాహనాన్ని జీపీఎస్‌ సాంకేతికత ఆధారంగా నేరుగా పార్కింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లి పార్క్‌ చేయవచ్చు. ఇక 24 మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్‌ ప్రదేశాల్లో ఏకకాలంలో 4,000 ద్విచక్రవాహనాలు, 400 కార్లను పార్కింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. పార్కింగ్‌ ఫీజును సైతం ఆన్‌లైన్, మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లించే అవకాశం ఉండటం విశేషం.  

పార్కింగ్‌ కేంద్రాల్లో ఉచిత వై..ఫై.. 
వాహనాల పార్కింగ్‌ షెల్టర్లను అత్యాధునికత ఉట్టిపడేలా ఏర్పాటు చేయడంతోపాటు తీరైన ఆకృతు లు, పైకప్పులతో వీక్షకులను కట్టిపడేసేలా ఏర్పా టు చేయనున్నారు. వాహనాలు వర్షానికి తడవకుం డా.. ఎండకు ఎండకుండా షెల్టర్లను తీర్చిదిద్దను న్నారు. ఈ కేంద్రాల వద్ద కూర్చునే సదుపాయం కల్పించడంతోపాటు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.  

దశలవారీగా మిగతా మెట్రో స్టేషన్లలో ఏర్పాటు..? 
ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఫలక్‌నుమా, నాగోల్‌–రాయదుర్గం మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో మెట్రో ప్రాజెక్టును చేపడుతున్న విషయం విదితమే. మూడు మార్గాల్లో మొత్తం 65 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతగా 24 స్టేషన్ల వద్ద స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రానున్నారు. మిగతా స్టేషన్ల వద్ద దశలవారీగా ఈ వసతి కల్పిస్తామని హెచ్‌ఎంఆర్‌ అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది ఆగస్టులో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ (16 కి.మీ.), అక్టోబరు నెలలో అమీర్‌పేట్‌–హైటెక్‌ సిటీ (11 కి.మీ.) రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  

ద్విచక్ర వాహనానికి రూ.3 కారుకైతే రూ.8 
స్మార్ట్‌ పార్కింగ్‌ విధానంలో మీ ద్విచక్ర వాహనాన్ని మెట్రో స్టేషన్‌ వద్ద పార్క్‌ చేస్తే గంటకు రూ.మూడు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే కారుకైతే గంటకు రూ.ఎనిమిది చార్జీ వసూలు చేస్తారు. అన్ని పార్కింగ్‌ చెల్లింపుల లావాదేవీలను డిజిటైజేషన్‌ చేయనున్నారు. పార్కింగ్‌ ఉల్లంఘనలను సైతం సీసీటీవీలో రికార్డు చేయనున్నారు. ఈ కెమెరాలను పోలీసు కమిషనర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంట్రల్‌కు అనుసంధానిస్తారు. పార్కింగ్‌ కేంద్రాల వద్ద వాహనాల భద్రతకుకు ప్రైవేటు సెక్యూరిటీతోపాటు ట్రాఫిక్‌ పోలీసులు రక్షణ కల్పించనున్నారు. 

మరిన్ని వార్తలు