స్మార్ట్‌ పోరు

9 Apr, 2020 10:03 IST|Sakshi

వైరస్‌ నియంత్రణకు ఎల్‌అండ్‌టీ స్మార్ట్‌ టెక్నాలజీ

రోగుల ట్రాక్, వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో సహాయకారి

సిటీ సహా దేశంలో మరో 20 నగరాల్లో సేవలు

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ మహమ్మారిని తరిమివేసే ప్రక్రియలో ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా ఎల్‌అండ్‌టీ సంస్థ పలు స్మార్ట్‌ టెక్నాలజీ సేవలు అందిస్తోంది. ఈ అత్యవసర సమయంలో పౌరసేవల నిర్వహణ కోసం ఎల్‌అండ్‌టీ వరల్డ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని ముంబై, పుణె, నాగ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, అహ్మదాబాద్,విశాఖపట్టణం, హైదరాబాద్‌ సహా 20ప్రధాన నగరాల్లో కరోనాపై పోరాడేందుకు
అవసరమైన స్మార్ట్‌ టెక్నాలజీ పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సాంకేతికతల ఆధారంగా సంబంధిత నగరాల్లోని వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పోలీసు తదితర ప్రభుత్వ యంత్రాంగాలు రోగులను ట్రాక్‌ చేయడం, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడం, క్వారంటైన్‌ అయిన ప్రజలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నిర్వర్తించడంలో సహాయపడుతోందని ఈ సంస్థ తెలిపింది. ముఖ్యంగా పోలీసులకు.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ సమూహాలుగా ఉన్న పౌరులను నియంత్రించడం, అధికార యంత్రాంగం రెస్క్యూ ప్రయత్నాలను ముమ్మరం చేయడం, కోవిడ్‌–19 సంబంధిత సందేశాలను ప్రాచుర్యం చేయడం, ప్రస్తుత సంక్షోభ సమయంలో చట్ట నియమాలను అందరికీ తెలియజేసేందుకు ఈ స్మార్ట్‌ టెక్నాలజీ ఉపకరిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

సాంకేతికతతో పరిష్కార మార్గాలు..
దేశంలోని పలు నగరాల్లోని మున్సిపల్, పోలీస్‌ ఏజెన్సీలతో తమ కంపెనీ భాగస్వామ్యం చేసుకుని సాంకేతికతను రూపొందించడంతో పాటు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు, సిటీ ఆపరేషన్స్‌ సెంటర్లను తమ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందని తెలిపారు. కోవిడ్‌– 19 మహమ్మారితో తీవ్రంగా పోరాడుతున్న ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటి. ఇక్కడ ఎల్‌అండ్‌టీ సంస్థ రూపొందించిన స్మార్ట్‌ టెక్నాలజీ సాంకేతిక పరిష్కారాలు నగర అధికారులు ఈ మహమ్మారితో సమర్థంగా పోరాడేందుకు తోడ్పడుతున్నాయన్నారు. లార్సన్‌ అండ్‌ టోబ్రో సీఈఓ అండ్‌ మేనేజింగ్‌ డెరైక్టర్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ మాట్లాడుతూ.. ‘ఎల్‌ అండ్‌ టీ స్మార్ట్‌ వరల్డ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు నగర అధికార యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడంతో పాటు ప్రభావవంతంగా అతి క్లిష్టమైన పౌర సేవలను మెట్రోపాలిటన్‌ నగరాలలో నిర్వహిస్తోంది. నిఘా, సమూహ నిర్వహణ, సందేశాలను పంపడం, ఆయా నగరాల్లో నివాసముంటున్న ప్రజలకు సమాచారం చేరవేయడం వంటి సేవలను నిర్వహించడంలో పలు స్మార్ట్‌ టెక్నాలజీలను ఎలాంటి క్లిష్టత లేకుండా మిళితం చేయగలిగిన సామర్థ్యం కారణంగానే, ఎల్‌ అండ్‌టీ ఇప్పుడు పౌర పరిపాలన మార్పునకు మద్దతునందించగలుగుతోందని ఆయన పేర్కొన్నారు.  

మన రాష్ట్రంలో స్మార్ట్‌ సేవలివే..
ఏఐ ఆధారిత వాహన కదలికల నియంత్రణ: హైదరాబాద్‌ నగరంలో స్థానిక అధికార యంత్రాంగం మూడు కిలోమీటర్ల పరిధిని దాటి వెళ్లవద్దని,  నిత్యావసర సరుకులు కొనగోలు చేసేందుకు కూడా ఆ పరిధి దాట వద్దని కోరింది. పోలీసులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు సృజనాత్మక మార్గం అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారిత ఆటోమేటెడ్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్‌నైజేషన్‌ (ఏఎన్పీఆర్‌) వ్యవస్థ ఉపయోగించుకుని వాహనాల లొకేషన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒక వాహనం మూడు కిలోమీటర్ల పరిమితి దాటగానే, స్వయంచాలకంగా ఓ అలర్ట్‌ను పోలీసులకు పంపుతారు. దీనికి అదనంగా, ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీఏ) డాటా బేస్‌తో అనుసంధానించటం వల్ల వాహన యజమానులను గుర్తించి హెచ్చరికలను కూడా జారీచేయవచ్చు. 

ఏఐ ఆధారిత క్రౌడ్‌ కంట్రోల్‌: నగరవ్యాప్తంగా అతి ముఖ్యమైన కూడళ్లలో 200కుపైగా కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలు ప్రజలు గుంపులు ఏర్పడటాన్ని గమనించడంతో పాటు పోలీస్‌ కమాండ్‌ సెంటర్‌ను తక్షణమే ఆప్రమత్తం చేస్తుంది. హైదరాబాద్‌ పోలీస్‌ ఇప్పటి వరకూ 1000కు పైగా అలర్ట్స్‌ అందుకోవడంతో పాటు పోలీసులు తమ ఫీల్డ్‌ ఆఫీసర్ల ద్వారా ఆ సమూహాలను విజయవంతంగా చెదరగొట్టారు.

పబ్లిక్‌ మెసేజ్‌: పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ (పీఏఎస్‌)ను హైదరాబాద్‌ నగరంలో విభిన్న ప్రాంతాలలో అమర్చారు. వీటిని పోలీస్‌ కమాండ్‌ సెంటర్‌కు అనుసంధానించారు. కోవిడ్‌–19కు సంబంధించి తరచూ చేసే ప్రకటనలతో పాటు పోలీసులు కస్టమైజ్డ్‌ ప్రకటనలను సైతం ఎక్కడైతే ప్రజా సమూహాలు ఏర్పడతాయో అక్కడ స్ధానిక భాష, ప్రాంతం, కంటెంట్‌ ఆధారంగా విడుదల చేస్తున్నారు.

మెసేజ్‌ డిస్‌ప్లే: హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ కోసం 40 వేరియబల్‌ మెసేజ్‌ డిస్‌ప్లే (వీఎండీ)బోర్డులపై ఎల్‌అండ్‌టీ ఆధారపడింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్‌–19పై ప్రభుత్వం వెల్లడించే సమాచారాన్ని వాటిపై ప్రదర్శిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు