సర్పం... స్పెషల్‌

18 Apr, 2017 02:45 IST|Sakshi
సర్పం... స్పెషల్‌

సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో ఓ అరుదైన పామును గుర్తించారు. వీపనగండ్ల మండలంలోని సంగినేనిపల్లి తండాలో ఓ ఇంట్లో పాము కనిపించింది. చూసేందుకు విచిత్రంగా ఉండడంతో ఆ గ్రామానికి చెందిన మహేష్, చంద్రశేఖర్‌లు పామును పట్టుకొని వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు, సర్ప రక్షకుడు డాక్టర్‌ బి.సదాశివయ్యకు ఇచ్చారు. పామును క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది అరుదుగా కనిపించేదిగా భావించి, జర్మనీకి చెందిన శాస్త్రవేత్త గెర్నాట్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఆ పాము లైకోధాన్‌ ఫ్యావికొల్లిస్‌గా గుర్తించారు. దీని మెడపైన బంగారు వర్ణంలో పసుపు పట్టీ ఉంది. మిగతాభాగం ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది.

సుమారు 40 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతుంది. విషరహితమైన ఈ పాము పగటి వేళలో మాత్రమే తిరుగుతుంది. ఎలాంటి గోడలైన సులువుగా ఎక్కుతుందని సదాశివయ్య తెలిపారు. ఈ సర్పాన్ని మొదటగా పశ్చిమ కనుమల్లోని ఆనైకోట్టి కొండల్లో గుర్తించారని, తరువాత 2014లో శేషాచల కొండల్లో, కర్ణాటకలోని టుంకూర్, హోస్పేట్‌ ప్రాంతాలలో కనబడిందని పేర్కొన్నారు. ఇది అరుదుగా కనిపించడం వల్ల శాస్త్రవేత్తలు పెద్దగా దీనిపై దృష్టి సారించడం లేదని తెలిపారు. ఈ పామును సోమవారం నల్లమల అటవీ ప్రాంతంలో వదిలివేశామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు