పుంజుకోని వరి నాట్లు.. 

13 Dec, 2018 02:20 IST|Sakshi

ఇప్పటివరకు 37 వేల ఎకరాల్లోనే రబీ సాగు

సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రబీ వరి సాగు నిరాశాజనకంగా మారింది. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, చెరువులు, బావులు, బోర్లలో నీటివనరులు అడుగంటడంతో నాట్లు పుంజుకోవడంలేదు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 37,500 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గతేడాది రబీలో వరి సాగు గణనీయంగా జరిగినా, ఈసారి పరిస్థితి దారుణంగా ఉందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రబీ పంటల సాగుపై వ్యవసాయశాఖ బుధవారం ఒక నివేదికను సర్కారుకు పంపించింది.

ఆ నివేదిక ప్రకారం రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 8.20 లక్షల (25%) ఎకరాల్లోనే సాగయ్యాయి. అందులో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.80 లక్షల (44%) ఎకరాల్లో సాగైంది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.70 లక్షల (87%) ఎకరాల్లో వేశారు. ఇక వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.22 లక్షల (63%) ఎకరాల్లో సాగైంది.  

18 జిల్లాల్లో వర్షాభావం... 
రాష్ట్రంలో రబీ సీజన్‌ మొదలైన అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు కరువు ఛాయలు నెలకొన్నాయని వ్యవసాయశాఖ తెలిపింది. అక్టోబర్‌లో 83 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, నవంబర్‌లో ఏకంగా 95 శాతం లోటు రికార్డు అయింది. ఇక డిసెంబర్‌లో ఇప్పటివరకు 81 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు వేసిన అంచనా ప్రకారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 13 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.

మరోవైపు రాష్ట్రంలో మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈ దాడి అధికంగా ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇక ఖరీఫ్‌లో వరి కోతలు కొనసాగుతున్నాయి. కంది ఇప్పుడే కోత దశకు చేరింది. జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్‌లన్నీ చేతికొచ్చాయి. ఇక పత్తి తీత చివరి దశకు చేరుకుంది. మిరప రెండో తీత దశలో ఉందని వ్యవసాయశాఖ తెలిపింది.   

మరిన్ని వార్తలు