సామాజిక మార్పు మా లక్ష్యం

12 Mar, 2020 02:05 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి. చిత్రంలో సుమతి, స్వాతి లక్రా, నవీన్‌ మిట్టల్‌

ఏడాదిలో లక్ష మంది విద్యార్థులకు శిక్షణ 

పబ్లిక్‌ సేఫ్టీ క్లబ్‌ ప్రారంభోత్సవంలో డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘నేటి విద్యార్థులే భావి పౌరులు.. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తయ్యాక వారే సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తారు. విద్యార్థుల్లో స్త్రీ, శిశు, ట్రాఫిక్, సామాజిక భద్రత విషయాలపై చైతన్యం తేవడం ద్వారా భద్రమైన సమాజం నిర్మించాలన్నది మా లక్ష్యం’అని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన పబ్లిక్‌ సేఫ్టీ క్లబ్‌ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలో భద్రత, రక్షణ ప్రమాణాలను భావితరాలకు అలవాటు చేయాలన్న సంకల్పంతో స్కూళ్లు, డిగ్రీ, పీజీ కాలేజీల్లాంటి దాదాపు 2,500 విద్యా సంస్థల్లో మహిళా, చిన్నారి, రోడ్‌ సేఫ్టీ లాంటి అంశాలపై అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమానికి విమెన్‌ సేఫ్టీ వింగ్‌ శ్రీకారం చుట్టిందని ప్రశంసించారు. సామాజిక మార్పు తేవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ క్లబ్బుల ద్వారా ఏడాదిలోగా లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రతకు తామెంతో ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. అనంతరం పబ్లిక్‌ సేఫ్టీ క్లబ్‌లకు సంబంధించిన పలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను డీజీపీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఐజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు