బోధనా నైపుణ్యం పెంపొందించుకోవాలి

13 Dec, 2014 04:14 IST|Sakshi
బోధనా నైపుణ్యం పెంపొందించుకోవాలి

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
నల్లగొండ అర్బన్: నేటి విద్యార్థి పాఠ్యపుస్తకాలకే పరిమితం కావ డం లేదని, విసృ్తతమైన వారి ఆలోచనా పరిధికి అనుగుణంగా అధ్యాపకుడు బోధనానైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ కార్యాలయం ఆధ్వర్యంలో స్థానిక గౌతమి కాలేజీలో జూనియర్ లెక్చరర్లకు నిర్వహిస్తున్న ఓరియెంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘సామాజిక న్యాయం-సమానత్వం’ అనే అంశంపై ప్రసంగించారు.

సుదీర్ఘకాలం ఒకే వృత్తిలో పనిచేస్తున్న వారికి మళ్లీ శిక్షణలు, అవగాహన సదస్సులు అవసరమా అని సహజంగా అందరికీ సందేహాలొస్తుంటాయి కానీ, ఇలాంటి కార్యక్రమాలు సమష్టి చర్చకు వేదిక అవుతుందనేది వాస్తవమన్నారు. ఉన్న సబ్జెక్టును మరింత బాగా బోధించడానికి పునశ్చరణ అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మౌలిక వసతుల కొరత, అధ్యాపకుల ఖాళీలు ఇతర సమస్యలతో బోధన క్లిష్టంగా మారుతోందన్నారు.

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనతో ఇంటర్ విద్యకు పూర్వవైభవం దక్కగలదన్నారు. సూత్రీకరణ ద్వారానే సంకల్పాన్ని చేరుకోగలరన్నారు. నిత్యజీవితంలో సూత్రీకరణ లేకుండా పురోగతిని సాధించలేమన్నారు. సంకల్పం లేకుండా దేన్నీ విశ్లేషించలేమన్నారు. సమాజం లో అంతరాలు పాటించే పరిస్థితి పోవాలంటే సమానజీవన అవకాశాలు రావాలన్నారు. సామాజిక శాస్త్రాల పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఇంటర్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పి. మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా బోధనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరముందన్నారు. శిక్షణలకు హాజరు కావడం, సమావేశాల్లో పాల్గొనడం వల్ల జ్ఞాన వికాసాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆర్‌ఐఓ నెమ్మాది ప్రకాశ్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, ఇంటర్‌బోర్డు పరీక్షల రిటైర్డ్ కంట్రోలర్ ఎం.భాస్కర్‌రెడ్డి, ఎంజీ యూనివర్సిటీ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ ఆకుల రవి, దేవరకొండ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మారుతీరావు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు గోనారెడ్డి, నర్సిరెడ్డి, అంజయ్య, గట్టుపల్లి అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు