సోషల్‌ మీడియా సొంత కోడ్‌

23 Mar, 2019 07:55 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సంబంధించి తాము కూడా ‘స్వచ్ఛంద నైతిక నియమావళి’ని పాటిస్తామని సామాజిక మాధ్యమాలు ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు తమసైట్లలో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తామని ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, గూగుల్, షేర్‌చాట్, టిక్‌టాక్‌ వంటి సామాజిక మాధ్యమాలు స్పష్టం చేశాయి. కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై మూడు గంటల్లోగా చర్య తీసుకుంటామని కూడా అవి హామీ ఇచ్చినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదే తొలిసారి..
మరో మూడు వారాల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు కూడా ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు ఇంటర్‌నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ), సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో ఎన్నికల సంఘం ఇటీవల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో జరిగిన చర్చల పర్యవసానంగా నైతిక నియమావళిని స్వచ్ఛందంగా పాటించేందుకు సామాజిక మాధ్యమాలు అంగీకరించాయని ఎన్నికల సంఘం ఆ ప్రకటనలో తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 126వ అధికరణ ప్రకారం పోలింగుకు 48 గంటల ముందు పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. ఏ పార్టీ అయినా దీనిని ఉల్లంఘిస్తే మూడు గంటల్లోగా దానిపై చర్య తీసుకోవాలని సిన్హా కమిటీ సిఫారసు చేసింది. ఆ కమిటీ సిఫారసు మేరకు తాము మూడు గంటల్లోగా ఉల్లంఘనలపై చర్య తీసుకుంటా మని సామాజిక మాధ్యమాలు  ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చాయి.

ఇంటర్‌నెట్‌ ఆధారిత సంస్థలు ఎన్నికల నియమావళిని పాటించేం దుకు తమంతట తాముగా ముందుకు రావడం ఇదే మొదటిసారి. సామాజిక మాధ్యమాల నిర్ణయంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ ఆరోరా హర్షం వ్యక్తం చేశారు. ఈ నియమావళిని సామాజిక మాధ్యమాలు తు.చ. తప్పకుండా పాటిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలు, ఎన్నికల సంఘానికి మధ్యవర్తిగా ఐఏఎంఏఐ వ్యవహరిస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. రాజకీయ ప్రకటనల చెల్లింపుల విషయంలో కూడా పారదర్శకంగా ఉంటామని సామాజిక మాధ్యమాలు స్పష్టం చేశాయి. గత ఎన్నికల సందర్భంగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పోస్టు కావడం, దుష్ప్రచారం జరగడం, ద్వేషపూరిత ప్రసంగాలు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడటం కోసం ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాలకు కూడా నియమావళిని ప్రతిపాదించింది.

>
మరిన్ని వార్తలు