ఆ దయ గల గోడ..

15 Jun, 2017 04:28 IST|Sakshi
ఆ దయ గల గోడ..
నిజామాబాద్‌లో డాక్టర్‌ శ్రావణి, శ్రీనుల వినూత్న సేవా కార్యక్రమం
 
ఇదో గోడ.. అన్ని చోట్లా ఉన్నట్లే ఇక్కడానూ..అయితే.. ఇది పిట్ట గోడ కాదు..పోకిరీలు కాలక్షేపం చేసే గోడ కానే కాదు.. ఇదో దయ గల గోడ..ఇక్కడ దయ లభిస్తుంది..బట్టలు లభిస్తాయి..పాఠ్య పుస్తకాలు లభిస్తాయి..చెప్పులు.. బ్యాగులు లభిస్తాయి..అంతేకాదు.. సాటి మనిషికి సాయపడాలన్న సందేశమూ లభిస్తుంది.. 
 
అసలు.. అనవసరం అన్న పదంలోనే అవసరం అన్న పదమూ దాగుంది.. అదే ఈ సేవకు స్ఫూర్తి. ప్రభుత్వ సహాయం అవసరం లేకుండా.. మనిషికి మనిషి సాయపడాలన్న ఉద్దేశంతో నిజామాబాద్‌కు చెందిన డాక్టర్‌ శ్రావణి, శ్రీనునాయక్‌ దంపతులు ఈ ‘వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌’కు శ్రీకారం చుట్టారు. ఇంట్లో మనకు అవసరం లేనివి.. వృథాగా మూలనపడేసిన వస్తువులను అవసరం ఉన్న వారికి, నిరుపేదలకు దానం చేయాలనే సదాశయంతో పట్టణంలోని ఖలీల్‌వాడి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం చౌరస్తాలో ఉన్న స్కూల్‌ గోడపై ఇలా రాయించారు. ‘‘మీకు ఉపయోగం లేనివి ఇంట్లో ఉంటే ఇక్కడ వదలండి– మీకు అవసరమైనవి ఇక్కడ ఉంటే తీసుకెళ్లండి’’ అని రాయించారు.

ఈ నెల 4 నుంచి ఈ వినూత్న సామాజిక సేవా కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపల్‌ అధికారుల అనుమతి తీసుకొని కొద్దిరోజుల్లో ఇనుపషెడ్‌ను వేయిస్తామని శ్రావణి, శ్రీనునాయక్‌ చెబుతున్నారు. ఈ తరహా సేవా కార్యక్రమాన్ని తాము జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూర్‌లోని పలు స్కూళ్లలో చూశామని.. ఆ స్ఫూర్తితోనే నిజామాబాద్‌లో ప్రారంభించామని తెలిపారు. వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. చాలా మంది పాత ప్యాంట్స్, షర్ట్సు, టీ షర్ట్సుతోపాటు హ్యాండ్‌ బ్యాగులు, టెన్త్, ఇంటర్, నీట్‌ బుక్స్‌ ఇక్కడ వదలి వెళ్లారని.. వాటిని అవసరం ఉన్న వారు తీసుకువెళ్లారన్నారు. ఈ చక్కటి సామాజిక సేవా కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు చేయూతనందిస్తారన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. అటు సోషల్‌ మీడియాలోనూ దీనికి మద్దతుగా ప్రచారం పుంజుకుంటోంది. – నిజామాబాద్‌ కల్చరల్‌
మరిన్ని వార్తలు