గుండెకు ఐటీ పోటు

14 Oct, 2017 08:52 IST|Sakshi

ఒత్తిడికి చిత్తవుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

నిద్రలేమి, హైబీపీ, జీవనశైలి మార్పులతో ఆరోగ్య సమస్యలు

‘ఐటీ’లో ప్రతి నెలా ఐదుగురికి అకస్మాత్తుగా గుండెపోటు..

ప్రాథమిక చికిత్స ఆలస్యమైతే ఆకస్మిక మరణాలు

51% మందిలో బీపీ సమస్య..

ఈకిన్‌కేర్‌ సంస్థ చేపట్టిన సర్వేలో వివరాలు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌
కిరణ్‌ నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీమ్‌లీడర్‌. ఇటీవల ఆఫీసులో ఉండగా ఛాతీలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. సహోద్యోగులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కిరణ్‌ గుండెపోటుతో కుప్పకూలాడని వైద్యులు తేల్చారు. ..ఇది కిరణ్‌ ఒక్కడి సమస్యే కాదు.. ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో పనిచేస్తున్న చాలామంది నగరవాసులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్టు ఈకిన్‌కేర్‌ అనే సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో వెల్లడైంది.

ప్రతి నెలా ఐదుగురికి..
ఐదంకెల వేతనం.. హైటెక్‌ సొబగులు.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. కారులో షికారు.. వీకెండ్‌ పార్టీలతో జోష్‌.. ఇదంతా ఐటీ ఉద్యోగుల జీవితంలో నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే. హైబీపీ, జీవనశైలి సమస్యలు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు పని ప్రదేశంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులు అకస్మాత్తుగా గుండెపోటుతో ఆఫీసులోనే కుప్పకూలుతుండటం నాణేనికి మరో పార్శ్వమని ఈ సర్వేలో వెల్లడైంది. ప్రతి నెలా నగరంలో సగటున సుమారు ఐదుగురు ఇలాంటి సమస్యలతో చిత్తవుతున్నట్లు తేలింది. ఐటీ ఉద్యోగుల్లో హైబీపీతో బాధ పడుతున్న వారు 51 శాతం మేర ఉన్నట్లు సర్వే తేల్చింది. ప్రధానంగా ఒత్తిడి, జీవనశైలి సమస్యలే దీనికి కారణమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఐదు నిమిషాల వ్యవధిలో రోగికి ప్రాథమిక చికిత్స అందించని పక్షంలో కొన్నిసార్లు ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రాథమిక చికిత్స అందించడంలో విఫలం..
ఛాతీలో నొప్పి, గుండెపోటుతో ఉద్యోగులు కుప్పకూలుతున్న సందర్భాల్లో వారికి ప్రాథమిక చికిత్సను అందించే విషయంలో పలు కంపెనీల్లో అవసరమైన వసతులు కరువైనట్లు ఈ సర్వేలో తేలింది. ఆకస్మిక గుండెపోటు సంభవించిన ఐదు నిమిషాల్లో అత్యవసర ప్రాథమిక చికిత్స అందించని పక్షంలో మెదడులోని కణాలు చచ్చిపోతాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అత్యవసర చికిత్స అందించేందుకు ఆయా కంపెనీల్లో ఛాతీభాగానికి స్వల్ప షాక్‌లు ఇచ్చేందుకు అవసరమైన కార్డియోపల్మనరీ రీససిటేషన్‌(సీపీఆర్‌) యంత్రాలు లేవని.. వీటిని నిర్వహించే సిబ్బంది కూడా లేరని కార్డియాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు సరైన చికిత్స తీసుకోని పక్షంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎలాంటి సమస్యలూ లేని వారు సైతం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్న యాంగ్జైటీ, ఒత్తిడితో అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్నారని తెలిపారు. ఆయా కంపెనీల్లో సీపీఆర్‌ యంత్రాలు, వాటిని వినియోగించే సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు.

ఐటీకి హైబీపీ..
ఇటీవల నగరంలోని 30 ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న ఆరు వేల మంది ఉద్యోగులపై ఈ కిన్‌కేర్‌ సంస్థ సర్వే చేసింది. ప్రధానంగా 25–55 ఏళ్ల మధ్య వయో గ్రూపులున్న వారిపై సర్వే చేపట్టారు. ఇందులో 4,500 మంది పురుషులు, 1,500 మంది మహిళలు ఉన్నారు. పనిఒత్తిడి, మారిన ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం వల్ల వీరిలో 51 శాతం మంది బీపీతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో 43 శాతం మంది సాధారణ రక్తపోటుతో మరో 8 శాతం మంది హైబీపీ(తీవ్ర రక్తపోటు) సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది తమ వయసు, ఎత్తుకంటే అధిక బరువుతో సతమతం అవుతున్నట్లు వెల్లడైంది. ఇక ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం నమోదవుతోన్న గుండెపోటు మరణాల్లో 21 శాతం వాటికి హైబీపీనే కారణమని సర్వే పేర్కొనడం గమనార్హం.

సరైన వ్యాయామం అవసరం..
ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్నవారు ప్రధానంగా నిద్రలేమి, హైబీపీ, జీవనశైలి మార్పు, జంక్‌ఫుడ్, వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలను.. ఆకస్మిక గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, కాళ్లు, చేతుల్లోని నరాల్లో రక్తం గడ్డకట్టడం వంటి ఉపద్రవాలను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఆరోగ్యవంతమైన మనిషికి బీపీ 140/90 ఉండాలి. హైబీపీని తగ్గించుకోవాలంటే తినే ఆహారంలో ఉప్పు, నూనె మోతాదులను తగ్గించుకోవాలి. సరైన వ్యాయామంతోపాటు పండ్లు, ఆకు కూరలు బాగా తీసుకోవాలి.

– డాక్టర్‌ ప్రహ్లాద్, ఫిజిషియన్, శ్రీకర హాస్పిటల్‌

మరిన్ని వార్తలు