ఉసురు తీసిన కుటుంబ కలహాలు

26 Jun, 2014 09:49 IST|Sakshi
ఉసురు తీసిన కుటుంబ కలహాలు

భార్య, కొడుకును హత్య చేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
 
గచ్చిబౌలిలో దారుణం
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

 
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షకు పైగా జీతం.. ఇంతకన్నా ఏం కావాలి? లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీవి తాన్ని అర్ధాంతరంగా ముగించాడు. కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కడతేర్చి తానూ ఉరివేసుకున్నాడు. బుధవారం వెలుగు చూసిన ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌కు చెందిన మనీష్ సాహు (35) మూడేళ్ల కిందట నగరానికి వచ్చాడు. మాదాపూర్‌లోని ఇమోమెంటస్ కంపెనీలో చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. మాదాపూర్‌లోనే మై హోమ్ నవద్వీప్ వరుణ  బ్లాక్‌లోని ఫ్లాట్ నెం 108లో భార్య శ్వేత సాహు (32), కొడుకు యశ్ (5)తో కలసి అద్దెకుంటున్నాడు. శ్వేత గృహిణి కాగా, యశ్ మెరిడియన్ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 19న ఆఫీస్‌కు వెళ్లి వచ్చిన మనీష్ శుక్రవారం నుంచి ఆఫీస్‌కు వెళ్లలేదు. బుధవారం ప్రాజెక్ట్ డెలివరీ ఉండటంతో కంపెనీ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్.. మనీష్ నివాసానికి వచ్చి చూడగా డోర్ వెనక నుంచి గడియపెట్టి ఉంది. కిటికీ తలుపులు తెరచి చూడగా తీవ్ర దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్ నిర్వాహకులకు విషయం చెప్పారు.

వారు వచ్చి కిటికీలోంచి చూడగా మనీష్ కిటికీకి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా శ్వేత, కొడుకు యశ్‌లు మంచంపై నిర్జీవంగా పడిఉన్నారు. మనీష్ నైలాన్ తాడుతో కిటికీకి ఉరివేసుకున్నాడు. ముగ్గురి శరీర భాగాలు ఉబ్బిపోయి ఉండడంతో నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. భార్య శ్వేత రెండుచేతుల మణికట్టుపై పదునైన కత్తితో కోయగా తీవ్ర రక్తస్రావమైనట్టుగా ఉంది. కొడుకు యశ్ తలకు, ముక్కు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి కొడుకును హతమార్చినట్లు తెలుస్తుంది. వారిద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను రెండు చేతుల మణికట్టుపై కోసుకున్న మనీష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు తెలిపారు. మనీష్, శ్వేత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 ఠాణాకీడ్చిందని..?:

రెండు నెలల నుంచి దంపతుల మధ్య ఏదో ఒక విషయుంపై గొడవలు జరుగుతున్నారుు. భర్త తనను వేధిస్తున్నాడని శ్వేత మాదాపూర్ పోలీసులను ఆశ్రరుుంచింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ చేసి పంపించారు. తనను పోలీసు స్టేషన్‌ కీడ్చిందని భార్యపై మరింత కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడా అనే సందేహాలు కలుగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు