‘సీతారామ’...పూడిక తీసేద్దామా..! 

20 Dec, 2019 03:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పూర్వ ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకానికి పూడికమట్టి సమస్య వెన్నాడుతోంది. ఈ ఎత్తిపోతలకు అవసరమయ్యే నీటిని తీసుకునే దుమ్ముగూడెం ఆనకట్ట ఎగువ ప్రాంతంలో భారీగా మట్టి, ఇసుక మేటలు వేయడంతో అది పంప్‌హౌస్‌లోకి చేరి, పంపులు, మోటార్లకు సమస్యలు తెచ్చే అవకాశం ఏర్పడనుంది. దీన్ని గుర్తించిన నీటి పారుదల శాఖ డ్రెడ్జింగ్‌ ద్వారా పూడికతీత తీయాలని నిర్ణయించింది. కేవలం 50 రోజుల వ్యవధిలో సుమారు 35వేల క్యూబిక్‌ మీటర్ల పూడిక మట్టిని తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక క్యూబిక్‌ మీటర్‌ పూడికను తీసేందుకు రూ.800 ఖర్చు కానుంది. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ఫిబ్రవరి రెండో వారానికి మొదటి పంప్‌హౌస్‌లో 3 మోటార్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి.    

మరిన్ని వార్తలు