అన్నదాతకు అండగా..

1 Jul, 2019 11:05 IST|Sakshi
మాటూర్‌లో భూసార పరీక్షల కోసం మట్టిని సేకరిస్తున్న దృశ్యం

జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌

మట్టి పరీక్షలపై వ్యవసాయ శాఖ దృష్టి

మండలానికో మోడల్‌ విలేజ్‌ ఎంపిక

సాక్షి, నాగిరెడ్డిపేట (కామారెడ్డి): జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,46,770 హెక్టార్లు ఉంది. ప్రధాన పంట వరి కాగా తర్వాత మొక్కజొన్న, పత్తి తదితర పంట లు సాగు చేస్తున్నారు. కాగా జిల్లాలో రైతులు ఎడాపెడా ఎరువులను వినియోగించడం వల్ల పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ (ఎన్‌ఎంఎస్‌ఏ)ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలకు వ్యవసాయ అధికారులు వెళ్లి, మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. జిల్లాలో అధికారులు రైతుల భూముల్లోనుంచి మట్టిని సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

మండలానికో మోడల్‌ విలేజ్‌ 
జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ కింద అధి కారులు 2019–20 సంవత్సరానికి జిల్లాలో మండలానికో మోడల్‌ విలేజ్‌ ఎంపిక చేశారు. జిల్లాలో 22 మండలాలు ఉండగా.. 22 గ్రామాలను ఎంపిక చేశారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలను సాగు చేయడం, ఎరువులు వినియోగించడం వల్ల ఆశించిన దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో భూసారం తెలుసుకోవడానికి వ్యవసాయ అధికారులు మట్టి పరీక్షలు నిర్వహిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ఆధునిక పద్ధతులను అమలు చేస్తారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగులో పాటించాల్సిన మెలకువలను రైతులకు వివరిస్తారు.

మోడల్‌ విలేజ్‌లుగా ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతిరైతుకు సంబంధించిన భూముల్లో మట్టిని సేకరించి పరీక్షలకు పంపించారు. వీటి ఫలితాలను వచ్చేనెలలో రైతులకు అందించేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కాగా జిల్లాలో ఎంపిక చేసిన 22 గ్రామాల్లో 3,485 మంది రైతులకు సంబంధించి 3,520 మట్టి నమూనాలను సేకరించారు. గతంలో పలుమార్లు భూసార పరీక్షల నిమిత్తం రైతుల భూముల్లో మట్టిని సేకరించినప్పటికీ వాటి ఫలితాలను రైతులకు అందించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈసారైనా రైతుల భూముల్లో నుంచి సేకరించిన మట్టినమూనాలకు సంబంధించి ఫలితాలను రైతులకు అందిస్తారా అని రైతులు అనుమానిస్తున్నారు.

వచ్చేనెలలో ఫలితాలు అందిస్తాం 
ఎన్‌ఎంఎస్‌ఏ పథకం కింద జిల్లాలో 22 గ్రామాలను ఎంపిక చేశాం. ఈ గ్రామాల్లో రైతుల భూములకు సంబంధించి మట్టినమూనాలను సేకరించి భూసార పరీక్షలకు పంపించాం. వీటి ఫలితాలను వచ్చేనెలలో రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఈ గ్రామాల్లో అమలు చేస్తాం. 
– నాగేంద్రయ్య, డీఏవో, కామారెడ్డి

మరిన్ని వార్తలు