భూసార పరీక్ష.. శ్రీరామరక్ష

1 Apr, 2019 16:18 IST|Sakshi
ఖాప్రిలోని మినీల్యాబ్‌లో భూసార పరీక్షలు చేస్తున్న అధికారులు (ఫైల్‌) 

క్లస్టర్ల వారీగా మినీల్యాబ్‌లు

జిల్లా వ్యాప్తంగా 101 కేంద్రాలు        

పరీక్షలు చేయించుకుంటే మేలంటున్న అధికారులు

సాక్షి, జైనథ్‌(ఆదిలాబాద్‌): గతంలో భూసార పరీక్షలు అంటేనే గ్రామానికి ఒకరు,ఇద్దరు రైతులు మాత్రమే చేయించేవారు. వ్యవసాయంపై అమితాసక్తి ఉండి చదువుకున్న రైతులు మాత్రమే చేన్లలో మట్టి పరీక్షలు చేయించునేవారు. అయితే చేన్లో మట్టి నమూనాలు సేకరించడం పట్ల అవగాహన లేకపోవడం, మట్టి పరీక్షలతో కలిగే లాభాలు తెలియకపోవడం, నమూనాలు పరీక్షించేందుకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపాల్సి రావడం వంటి కారణాలతో ఆసక్తి ఉన్నా అతికొద్ది మంది రైతులు కూడా మట్టి పరీక్షలు అంటే వెనకాడేవారు. అక్కడక్కడ రైతులు ఎవరైనా తమ చేన్లోని మట్టి నమూనాలకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కి పంపించిన కూడా ఫలితాలకోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీంతో భూసార పరీక్షల ఫలితాలు రైతులకు సకాలంలో అందకపోయేవి.

రైతులు కూడా తమ పక్క రైతులు వాడే ఎరువులనే ఇష్టారీతిగా పంటలకు వేసేవారు. దీంతో దిగుబడి పెరగడం మాట అటు ఉంచితే.. రైతులు పెట్టుబడి తడిసి మోపెడయ్యేది. దీంతోపాటు దీర్ఘకాలంగా ఒకే రకమైన రసాయనిక ఎరువులు విపరీతంగా వాడడంతో భూసారం తగ్గి, నేల నిర్జీవంగా తయారైంది. దీంతో ఏళ్లుగా రైతులు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోంది. రైతుల్లో మట్టి పరీక్షల పట్ల అవగాహన పెరగడం, వ్యవసాయశాఖ అధికారులు క్లస్టర్ల వారీగా మట్టి పరీక్షల కోసం మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో  పరీక్షలు చేయించుకుంటున్నారు.


జిల్లావ్యాప్తంగా 101 ల్యాబ్‌లు
గతంలో మట్టి పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా కేంద్రంలోని ప్రధాన ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే రైతులకు ఈ ల్యాబ్‌ గురించి పెద్దగా అవగాహన లేకపొవడం, దూర ప్రయాణాలు చేయాల్సి రావడం, ఫలితాలు రావడంలో నెలల తరబడి వేచి చూడాల్సి రావడం జరిగేది. దీంతో రైతులు మట్టి పరీక్షల గురించి అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో మినీల్యాబ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్‌ పరిధిలోని నాలుగైదు గ్రామాలకు కలిపి క్లస్టర్‌ గ్రామంలో మినీల్యాబ్‌ ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 101 క్లస్టర్లలో ఈ మినీ ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి.


ఏఈవోల ఆధ్వర్యంలో నిర్వహణ..
క్లస్టర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ మినీల్యాబ్‌ల నిర్వహణ బాధ్యతలు ఏఈవోలకే అప్పగించడం జరిగింది. దీనికోసం ఏఈవోలకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. దీంతో రైతులు తమ చేన్లోంచి తెచ్చిన మట్టిని ఇక్కడ పరీక్షించి ఒక్క రోజులోనే ఏఈవోలు ఫలితలు కూడా ఇచ్చేలా వెసులుబాటు కలిగింది. ఈ ల్యాబ్‌లో మట్టిలోని పీహెచ్‌(గాఢత), ఈసీ(లవణీయత), ఓసీ(సేంద్రియ కర్బనం), ఎన్‌పీకే(నత్రజని, భాస్వరం, పోటాషియం)లతోపాటు నేలలో ఉన్న సూక్షపోషకాల శాతాన్ని లెక్కించడం జరుగుతుంది. అనంతరం రైతులకు సాయిల్‌ హెల్త్‌కార్డ్‌ అనే ప్రత్యేకమైన రిపోర్టులు కూడా అందిస్తారు. దీని ఆధారంగా రైతులు వేసిన పంటలకు ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి? ఎప్పుడెప్పుడు వాడాలి? ఆ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? అనే వివరాలు రైతులకు సూచిస్తారు.

దీంతో తగిన మోతాదులో ఎరువులు వాడి రైతులు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా, లాభాలు ఆర్జించవచ్చని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ ఏడాది రైతుబంధు, పీఎం కిసాన్‌ వంటి ఇతరాత్ర పనుల వలన వ్యవసాయశాఖ అధికారులు భూసార పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 1450 మట్టి నమునాలు మాత్రమే పరిశీలించారు. అయితే ఈ ఏప్రిల్‌ నుంచి అన్ని గ్రామాల్లో మట్టి నమూనాల సేకరణ ఉధృతం చేస్తామని అధికారులు చెబుతున్నారు.


రైతులు సద్వినియోగం చేసుకోవాలి
గ్రామాల్లో రైతులకు మట్టి పరీక్షల సేవలు అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో మండలంలో క్లస్టర్‌కు ఒకటి చొప్పున మినీల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో రైతులు తీసుకొచ్చిన మట్టి నమూనాలు వెంటనే పరీక్షించి, ఒక్క రోజులోనే ఫలితాలు అందిస్తాం. ఈ ల్యాబ్‌ల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ఏఈవోలకు అప్పగించాం. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ భూమిలోని పోషకాలశాతం ఆధారంగా అవసరమైన మేరకు మాత్రమే బయట నుంచి ఎరువులు వేసుకోవాలి. దీనిద్వారా పెట్టుబడి తగ్గడమే కాకుండా, దిగుబడి కూడా పెరుగుతుంది.                                                  
– పుల్లయ్య, వ్యవసాయశాఖ, ఏడీఏ 

మరిన్ని వార్తలు