‘సోలార్’ సమావేశానికి 390 కంపెనీలు

6 Sep, 2014 02:18 IST|Sakshi
‘సోలార్’ సమావేశానికి 390 కంపెనీలు

ఉత్సాహం చూపిన ప్రవాస తెలంగాణ వాసులు
 
 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్‌పీడీసీఎల్) శుక్రవారం నిర్వహించిన ప్రీ-బిడ్ భేటీకి భారీస్పందన వచ్చింది.  విద్యుత్‌ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తూ, 390 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా అనేక మంది ప్రవాస తెలంగాణ వాసులు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకువచ్చారని అధికారులు తెలిపారు. ప్రీ-బిడ్ సమావేశానికి హాజరైనవారు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను, దరఖాస్తు విధానంలో చేయాల్సిన కొన్ని మార్పులను సూచించారు.. అవి ఈ విధంగా ఉన్నాయి.

  బిడ్డింగ్ డాక్యుమెంటులో పేర్కొన్న రెండు టారీఫ్‌ల విధానాన్ని మార్చి ఒక్క టారీఫ్ పద్ధతికే పరిమితం చేయాలి.

→   200 మెగావాట్ల ప్లాంట్ల వరకు గరిష్టంగా బిడ్లను వేయవచ్చునని పేర్కొనడంతో కేవలం రెండు, మూడు కంపెనీలకే అవకాశాలు పరిమితమయ్యే ప్రమాదం ఉంది.  గరిష్ట పరిమితిని తగ్గించి ఎక్కువ కంపెనీలు ముందుకువచ్చేలా నిబంధనలు మార్చాలి.

→  ప్లాంట్ల ఏర్పాటుకు సింగిల్‌విండో ద్వారా అనుమతులు ఇవ్వాలి. దీంతో ప్రాజెక్టులు త్వరగా నిర్మించే అవకాశం ఉంటుంది.
 ఇదిలా ఉండగా, ప్రతినిధుల అభ్యంతరాలు పరిశీలించి ప్రభుత్వంతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. బిడ్డింగ్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు