‘సోలార్‌’కు సై 

6 Mar, 2019 07:35 IST|Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: విద్యుత్‌ను ఆదా చేసేందుకు.. సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు.. ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు టీఎస్‌ రెడ్‌కో(తెలంగాణ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ద్వారా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తిని పెంచడం కోసం సోలార్‌ ఎనర్జీని కూడా ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది.
 
తొలుత ప్రభుత్వ కార్యాలయాలతోపాటు విద్యా సంస్థలు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాల్లో సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నోడల్‌ ఏజెన్సీ అయిన టీఎస్‌ రెడ్‌కో ఆయా ప్రాంతాల్లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీలోని రెన్యువల్‌ ఎనర్జీ సోర్స్‌ మంత్రిత్వ శాఖ సోలార్‌ పవర్‌ ప్లాంట్లను వినియోగిస్తే మొత్తం వ్యయంలో 25 శాతం సబ్సిడీ అందించేందుకు అంగీకరించింది. ఇందులో రెండు రకాలుగా సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు టీఎస్‌ రెడ్‌కో సన్నద్ధమవుతోంది.
 
సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు వెసులుబాటు 
ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సోలార్‌ పవర్‌ ప్లాంట్ల కోసం ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. ప్రైవేట్‌ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అందుబాటులో వారికి వీలుగా ఉంచేందుకు క్యాపెక్స్, రెస్‌కో పద్ధతిలో సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. మొదటగా క్యాపెక్స్‌ పద్ధతిలో సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటే ముందస్తుగా ప్లాంట్‌కు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. అదే రెస్‌కో విధానంలో అయితే ప్రతి నెలా సోలార్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు యూనిట్‌కు ఇంత చొప్పున నగదు చెల్లించాల్సి ఉంటుంది. క్యాపెక్స్‌ విధానంలో 1 నుంచి 10 కిలో వాల్ట్స్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే ఒక కిలో వాల్ట్స్‌కు రూ.53,750 చెల్లించాల్సి ఉంటుంది.

అదే 11 నుంచి 100 కిలోవాల్ట్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే రూ.49వేలు చెల్లించాలి. 101–1000 కిలో వాల్ట్స్‌ చొప్పున ఏర్పాటు చేస్తే రూ.45వేలు ఒక కిలో వాల్ట్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రెస్‌కో ద్వారా 1 నుంచి 10 కిలో వాల్ట్స్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కు 25 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.4.75 చెల్లించాల్సి ఉంటుంది. 11–100 కిలో వాల్ట్స్‌కు యూనిట్‌కు రూ.4.30, 101–1000 కిలో వాల్ట్స్‌ వరకు యూనిట్‌కు రూ.3.33 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా సోలార్‌ ప్లాంట్‌ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను కార్యాలయంలో ఏర్పాటు చేసిన బయో డైరెక్షనల్‌ మీటర్‌ ద్వారా దిగుమతి, ఎగుమతులను లెక్కిస్తారు. సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో విద్యుత్‌ శాఖ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్, సోలార్‌ ప్లాంట్‌ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ ఎంత వినియోగించారనేది బయో డైరెక్షనల్‌ మీటర్ల ద్వారా తేలిపోతుంది.

కొత్త భవనాలకు ప్రాధాన్యం 
కొత్త భవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖలకు సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సోలార్‌ ప్లాంట్‌కు 25 ఏళ్ల జీవితకాలం ఉన్నందున కొత్త భవనాలపైనే వీటిని నిర్మించాలని ప్రభుత్వం, టీఎస్‌ రెడ్‌కో ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పంచాయతీ కార్యాలయాలు, విద్యా సంస్థలపై వీటిని ఏర్పాటు చేయనున్నారు. టీఎస్‌ రెడ్‌కో జిల్లా అధికారులు ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు వెళ్లి.. శాఖల అధికారులతో మాట్లాడి సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించేందుకు అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర శాఖ అధికారులు.. జిల్లా అధికారులకు సూచనలు చేయడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు టీఎస్‌ రెడ్‌కో అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలో నూతన భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయించుకునేందుకు ప్రభుత్వ శాఖలు ముందుకొస్తే ఆయా శాఖలకు, సోలార్‌ ప్లాంట్లను నిర్మించే సంస్థలకు మధ్య టీఎస్‌ రెడ్‌కో అధికారులు ఒప్పందం కుదర్చనున్నారు.

ప్లాంట్ల నిర్మాణానికి ఆదేశాలు 
ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్‌ ప్లాంట్లు నిర్మించాలని రాష్ట్ర అధికారులు సూచనలు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి.. శాఖల అధికారులతో చర్చించి సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టాం. జిల్లాలో నూతన భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, విద్యా సంస్థలను గుర్తించి వారికి సోలార్‌ విద్యుత్‌పై అవగాహన కల్పించనున్నాం.  – వడపు సుబ్రహ్మణ్యం, టీఎస్‌ రెడ్‌కో, జిల్లా మేనేజర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా