సోలార్.. సూపర్!

23 Dec, 2014 01:52 IST|Sakshi
సోలార్.. సూపర్!

* నెట్ మీటరింగ్ పథకానికి విశేష స్పందన
* ఇటు సొంత విద్యుత్ బిల్లుల వ్యయంలో ఆదా
* అటు డిస్కంలకు విక్రయంతో అదనపు రాబడి
* విద్యుత్ కోతల నుంచీ ఉపశమనం పొందే అవకాశం
* సోలార్ యూనిట్లపై మొత్తంగా 50% సబ్సిడీ
* 3 కేవీ యూనిట్‌కు చెల్లించాల్సింది రూ. 1.78 లక్షలే
* దీనితో నెలకు 450 యూనిట్ల వరకూ విద్యుదుత్పత్తి
* సదరన్ డిస్కం పరిధిలో 500 నెట్ మీటర్లు!


సాక్షి, హైదరాబాద్: సంప్రదాయేతర  ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఫలిస్తోంది. విద్యుత్ కొరతను అధిగమించే కసరత్తులో భాగంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించే ప్రయోగానికి విశేష స్పందన కనిపిస్తోంది. తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో సోమవారం వరకు నెట్ మీటరింగ్ కోరుతూ 497 దరఖాస్తులు వచ్చాయి. దీంతో సౌర విద్యుత్ ఉత్పత్తి దాదాపు ఒక మెగావాట్‌కు చేరుతుందని డిస్కం అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ లెక్కన నెట్ మీటరింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అందరూ కలిపి సోలార్ ప్యానెళ్ల ద్వారా ఒక గంట పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తే... వెయ్యి యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధానంలో రోజుకు కనీసం ఆరు గంటల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 6,000 యూనిట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి రానుంది. గృహాలు, భవనాలు, బహుళ అంతస్తుల సముదాయాలతో పాటు ప్రధానంగా విద్యా సంస్థల యాజమాన్యాలు సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేందుకు చొరవ చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే అత్యధికంగా నెట్ మీటరింగ్‌కు దరఖాస్తులు వచ్చాయి.

రెండు విధాలా లాభం..
సౌర విద్యుత్ నెట్ మీటరింగ్ విధానం ద్వారా విద్యుత్ కోతల సమస్యను అధిగమించటంతో పాటు విద్యుత్ బిల్లులను కూడా ఆదా చేసుకునే వీలుంది. అవసరం లేని సమయంలో తమ సౌర విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించే వెసులుబాటు ఉండడమే దీనికి కారణం. నెట్ మీటరిం గ్‌కు సంబంధించి ఇప్పటివరకు 204 చోట్ల అమర్చినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 45 కనెక్షన్లు మంజూరైనప్పటికీ ఇంకా గ్రౌండింగ్ కాలేదు. మిగతా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని.. త్వరలోనే కనెక్షన్లను మంజూరు చేస్తామని డిస్కం అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలలుగా ఈ పథకానికి వస్తున్న దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని... మరింత ప్రచారం చేయాల్సి ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

భవిష్యత్‌లో కీలకం..
రాష్ట్రంలో విద్యుత్ కొరత పెరిగిపోనున్న దృష్ట్యా భవిష్యత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి, నెట్ మీట రింగ్ పథకం కీలకంగా మారే అవకాశముంది. ఇంటి పైకప్పు, భవనాలపై అమర్చుకునే సోలా ర్ యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం రాయితీ ఇస్తున్నాయి. ఈ లెక్కన దాదాపు సగం ధరకే సౌర విద్యుత్ యూనిట్ వినియోగదారులకు అందుతుంది. నెట్ మీటరింగ్ ద్వారా ఈ యూనిట్లలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను సొంత అవసరాలకు వాడుకోవటంతో పాటు.. అవసరం లేని సమయంలో ఒక్కో యూనిట్‌ను రూ. 3.38 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థకు విక్రయించే వీలుంది.

3 కేవీ సెట్ రూ. 1.78 లక్షలే!
ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్ ప్యానెళ్లను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. మార్కెట్లో కిలోవాట్ సామర్థ్యమున్న సోలార్ ప్యానెల్ రూ. 1.30 లక్షలు, 3 కేవీ ప్యానెల్ రూ. 3 లక్షలకు లభ్యమవుతోంది. ఈ 3 కేవీ యూనిట్‌కు కేంద్రం రూ. 72 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 వేలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఈ లెక్కన మిగతా రూ. 1.78 లక్షలు చెల్లించి 3 కేవీ ప్యానెల్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇంటి కప్పుపై ఈ యూనిట్‌ను అమర్చుకుంటే.. రోజుకు సగటున 12 నుంచి 15 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు నెలలో 500 యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారులు.. ఇప్పుడున్న స్లాబ్ పద్ధతిన ఒక్కో యూనిట్‌కు రూ. 8.38 చొప్పున బిల్లు చెల్లిస్తున్నారు. 12 నుంచి 15 యూనిట్ల సౌర విద్యుత్ అందితే.. నెలలో దాదాపు 360 నుంచి 450 యూనిట్లు ఆదా అవుతుంది. అంతకు మించి స్లాబ్ విధానంలో యూనిట్ రేటు నాలుగో వంతుకు తగ్గిపోతుంది.

నికర వాడకానికే బిల్లు..
పగటి పూట ఇంట్లో విద్యుత్ వాడకం తక్కువగా ఉంటుంది. ఆ సమయంతో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్ నెట్ మీటరింగ్ ద్వారా డిస్కంలకు చేరుతుంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ డిస్కంలకు సరఫరా అయిందనేది బై డెరైక్షన్ మీటర్లలో రికార్డవుతుంది. ప్రతి నెలా విద్యుత్ వాడకాన్ని పరిశీలిస్తారు. అందులో డిస్కంలకు అమ్మిన విద్యుత్‌ను మినహాయించి.. నికరంగా వాడుకున్న యూనిట్లకు మాత్రమే బిల్లు జారీ చేస్తారు. డిస్కం నుంచి వాడుకున్న విద్యుత్ కంటే.. డిస్కంకు అమ్మిన విద్యుత్ ఎక్కువగా ఉంటే.. అంత మేరకు యూనిట్‌కు రూ. 3.38 చొప్పున లెక్కగట్టి వినియోగదారులకు చెల్లిస్తారు. లేదా తదుపరి బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు.

మరిన్ని వార్తలు