రాష్ట్రంలో ‘సోలార్‌’ వెలుగులు

11 Jun, 2018 02:22 IST|Sakshi

రికార్డు స్థాయిలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి 

రాష్ట్రంలో 3100 మెగావాట్ల విద్యుత్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 కేంద్రాలు

సిరిసిల్ల: రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం సోలార్‌(సౌర) విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి సారించింది. ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడంతో గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా నాలుగు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో మూడు ప్లాంట్లు ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌)తో ఒప్పందం చేసుకోగా, మరో ప్లాంటు దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌)తో ఒప్పందం చేసుకుని విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి.  


రాష్ట్రంలో 3,100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి.. 
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3,100 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇందులో ఎస్‌పీడీసీఎల్‌ 2,100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగా.. 1,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని ఎన్‌పీడీసీఎల్‌ ఇటీవలే సాధించింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో కేవలం 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు ఈ సంస్థ పరిధిలో 1,000 మెగావాట్ల విద్యుత్‌ను సోలార్‌ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. పూర్వపు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలో కొత్తగా 40 సోలార్‌ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ప్రైవేటు కంపెనీలు వీటి ని స్థాపించి ఉత్పత్తిని ప్రారంభించాయి.

ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రామోజీపేట, పెద్దలింగాపూర్, ముస్తాబాద్‌ మండలం నామాపూర్, వేములవాడ మండలం నూకలమర్రిలో సౌర  ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెద్దఎత్తున సాగుతోంది. రామోజీపేటలో 150 ఎకరాల్లో ఉన్న ప్లాంటు ద్వారా నిత్యం 30 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుండగా సిరిసిల్ల శివారులోని పెద్దూరులోని 132 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు అనుసంధానం చేశారు. పెద్దలింగాపూర్‌లో 120 ఎకరాల్లోని ప్లాంటు నిత్యం 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడి విద్యుత్‌ను స్థానికంగా ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు, వేములవాడ మండలం నూకలమర్రిలో 100 ఎకరాల్లో ప్లాంటు ద్వారా రోజుకు 15 మెగావాట్ల విద్యుత్‌ను మల్లారంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేశారు.   

మరిన్ని వార్తలు