ఆశయం ఘనం.. అభివృద్ధి శూన్యం

28 Nov, 2015 01:13 IST|Sakshi
ఆశయం ఘనం.. అభివృద్ధి శూన్యం

అలంకారప్రాయంగా అపరెల్‌పార్క్
 నిరుపయోగంగా మారిన నిర్మాణాలు
 పట్టించుకోని పాలకులు

 మేడ్చల్:నగర శివార్లలో ఉన్న మేడ్చల్ ఒకప్పుడు వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. క్రమంగా వ్యవసాయానికి దూరమై రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగానికి చిరునామాగా మారింది. 1978లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి మేడ్చల్‌లో పారిశ్రామిక వాడకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేసింది. పేద ప్రజలకు ఉపాధి కల్పించాలన్న సదాశయంతో 1995 జూలై 19నపార్క్‌కు శంకుస్థాపన చేశారు. 1999 జూన్ 30న నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు. ప్రధానంగా కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించారు. వస్త్ర పరిశ్రమ ఎక్కువగా కర్ణాటకలో ఉండడంతో అక్కడి వ్యాపారులు అపరెల్ పార్క్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పార్క్‌ను రూపొందించారు.
 
 గ్రామానికి చెందిన పేద రైతుల నుంచి 157 ఎకరాల భూమిని సేకరించి మొత్తం 226.36 ఎకరాల్లో పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 129.87 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా 121 ప్లాట్లను రూపొం దించారు. 60 ఎకరాలను మరిన్ని పరిశ్రమల కోసం ఖాళీగా వదిలారు. 38 ఎకరాల్లో పార్క్‌లో రోడ్లు, మురికి కాలువలు, ఇతర వసతులతో పాటు విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేశారు. స్థానికంగా 30 వేలమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రారంభోత్సవంలో పాలకులు ఉపన్యాసాలు దంచారు. 30 వేలు కాదుకదా 3వేల మందికి కూడా ఉపాధి కల్పించలేకపోయారు.  

 పార్క్ అభివృద్ధికి వైఎస్సార్ కృషి..
 వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పార్క్ లక్ష్యాన్ని నెరవేర్చే ఉద్దేశంతో  2008 ఏప్రిల్ 7న ఇక్కడ రెండు పరిశ్రమలు ప్రారంభించారు.  బహుళరంగ కంపెనీలు రావాలని మరో 23 ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం అపరెల్ పార్క్ గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు.
 
 అడవిని తలపిస్తూ..
 పరిశ్రమలు, కార్మికులతో కళకళలాడాల్సిన అపరెల్ పార్క్ ప్రస్తుతం కళావిహీనమైంది. దాదాపు 100 ఎకరాలు ఖాళీగా ఉండటంతో చెట్లు, ముళ్లపొదలు పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపిస్తోంది. హుడా ఆధ్వర్యంలో పది ఎకరాల్లో మొక్కలను నాటారు. పార్క్‌కు రావడానికి విశాలమైన రోడ్లు, ఉద్యానవనాలు, కార్యాలయ భవనం నిర్మించారు. అవన్నీ ఇప్పుడు నిరుపయోగంగా మారాయి.  
 
 పట్టించుకోని ప్రభుత్వం..
 తెలంగాణ ఆవిర్భావం తర్వాత పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం అపరెల్ పార్క్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గత ఏప్రిల్ 29న అపరెల్ పార్క్‌లో పర్యటించారు. పార్క్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడు నెలలు గడిచినా ఒక్క అడుగుకూడా ముందుకు పడిన దాఖలాలు లేవు.
 

మరిన్ని వార్తలు