సమ్మెకు సంఘీభావం

10 May, 2015 23:37 IST|Sakshi

 ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే..
 వారి సమస్యల పరిష్కారానికి సర్కారు చొరవచూపాలి
 జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం

 
వికారాబాద్ : హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలియజేస్తున్నామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం  స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వికారాబాద్‌కు వచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తక్కువ జీతాలతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేయడం న్యాయమైనదేనని ఆయన పేర్కొన్నారు.

సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను సవరించుకోవడంపై ఆయన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని సూచించారు. కాగా.. ఆదివారం తాండూరు డిపోకు చెందిన బస్సుకు అడ్డు వెళ్లిన ఆర్టీసీ కార్మికుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా.. పోలీసులను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పరిస్థితి సద్దుమణిగింది.

తాండూరులో బస్సులను అడ్డుకునేందుకు కార్మికుల యత్నం
 తాండూరు : ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా యూనియన్ నాయకులు, కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆదివారం ఆర్టీసీ సమ్మె ఐదో రోజు సందర్భంగా యూనియన్ నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఉదయం 9గంటలకు ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, డిపో మేనేజర్ లక్ష్మీధర్మా వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికుల ప్రయత్నాలను విఫలం చేశారు. చించొళి, కరన్‌కోట్, కోస్గీ తదితర రూట్లలో నాలుగు బస్సులను అధికారులు నడిపించారు. దీంతో అధికారులకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ తాండూరు చైర్మన్ సోమశేఖర్‌తోపాటు నాయకులు ఆర్.విజయ్‌కుమార్, మదన్‌రెడ్డి, సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్ తదితరులు డిపో వద్దకు వచ్చి, సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సర్కారుకు సూచించారు. కార్మికుల సమ్మెకు అండగా ఉంటామన్నారు. సమ్మెలో భాగంగా యూనియన్ నాయకులు, కార్మికులు డిపో ఆవరణలో పాటలు పాడారు. కబడ్డీ ఆడారు.

మరిన్ని వార్తలు