పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం

22 Jul, 2015 03:59 IST|Sakshi
పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం

- వామపక్ష పార్టీల నేతలు
హన్మకొండ :
గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు అండగా వామపక్షాలు నిలుస్తాయని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని వామపక్ష నాయకులు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పది వామ పక్ష పార్టీలు చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం హన్మకొండకు చేరుకొంది. ఈ సందర్భంగా హన్మకొండలోని ఏకశిల పార్కులో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీపీఐ శాసన సభ పక్షనేత ఆర్.రవీందర్‌కుమార్ నాయక్, సీపీఎం శాసనసభ పక్షనేత సున్నం రాజయ్య మాట్లాడారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాలను జరుగనివ్వబోమని హెచ్చరించారు. సీఎం కే సీఆర్ విభజించి పాలించు అన్నట్లుగా కార్మికుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నందున అక్కడ పని చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచి తెలంగాణలోని ఇతర జిల్లాల కార్మికుల సమస్యలను విస్మరించారని మండిపడ్డారు. కార్మికులకు కమ్యూనిస్టులు అండగా నిలిస్తే ఆంధ్రా పార్టీలని చెప్పడం విడ్డూరంగా ఉందని, కమ్యూనిస్టులు పుట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్‌కు ఎర్ర జెండా పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

కేసీఆర్‌కు కార్మికుల పట్ల కనికరం లేదన్నారు. కార్మికులు భయపడొద్దని పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘా లు అండగా ఉంటాయని అన్నారు. సీపీఎం జిల్లా కార్యాదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యూ డెమొక్రసీ నాయకుడు రాయ చంద్రశేఖర్‌రావు, ఎంసీపీఐ నాయకుడు మహమ్మద్ గౌస్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు ఈసంపల్లి వేణు, తెలంగాణ ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల బిక్షపతి, వామపక్ష పార్టీల నాయకులు పోతినేని సుదర్శన్, గాదగోని రవి, సంపత్‌రావు, ఎం.చుక్కయ్య, పోతరాజు సారయ్య, దుబ్బ శ్రీనివాస్, సిరిబోయిన కరుణాకర్, టి.ఉప్పలయ్య, రాగుల రమేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు