ఆ జిల్లాలకు అన్యాయం చేస్తే సహించం: సోమారపు

19 May, 2020 20:00 IST|Sakshi

కరీంనగర్‌: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు నీటి కేటాయింపుల్లో అన్యాయం చేస్తే సహించేది లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లో మూడు పంటలకు నీరు ఇచ్చిన తర్వాతే మిగతా జిల్లాలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గోదావరి జలాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం నీటిని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు కేటాయించడం లేదని.. గోదావరి నీటిని పరివాహక ప్రాంతాలకు ఇవ్వకుండా కొండపోచమ్మకు తరలిస్తున్నారని మండిపడ్డారు.

కోవిడ్‌ నిర్మూలనకు కేంద్రం రూ. 230కోట్లు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. రెండోసారి లాక్‌డౌన్‌ను కఠినతరం చేయడం వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. నీటి వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సోమారపు సత్యనారాయణ ప్రభుత్వానికి సూచించారు.

మరిన్ని వార్తలు