సోమశిల వంతెన బాధ్యత మాది: నితిన్‌గడ్కరీ

3 Dec, 2018 08:09 IST|Sakshi

ఆపై జాతీయ రహదారి హోదా కల్పిస్తాం

కొల్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి

ఇక్కడి ప్రజలెవరూ సంతోషంగా లేరని తెలుస్తోంది..

బీజేపీ ప్రచార సభలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

సాక్షి, కొల్లాపూర్‌:  కొల్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావును గెలిపిస్తే, సోమశిల – సిద్దేశ్వరం వంతెన నిర్మిస్తామని, దీనికి జాతీయ రహదారి హోదా కల్పించి ఏపీ, తెలంగాణ రహదారులను అనుసంధానిస్తాం’ అని కేంద్ర జల, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు.

బీజేపీ కొల్లాపూర్‌ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు అధ్యక్షతన నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి, ఇంజనీరింగ్‌ నిపుణుడు, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని వచ్చిన సుధాకర్‌రావును ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.

కొల్లాపూర్‌లో ఆస్పత్రులు లేవు. ఉంటే వైద్యులు ఉండరు. స్కూళ్లలో టీచర్లు లేరని తెలిసింది. 20ఏళ్లుగా ఇక్కడి ప్రజలు సంతోషంగా లేరని చెబుతున్నారు. అందుకే అభివృద్ధిని పట్టించుకోని నాయకులను ఇంటికి పంపండి. పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సుధాకర్‌రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే జాతి, కుల, మతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం’ అని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, గోదావరి నీళ్లను కృష్ణానదికి సంధానం చేస్తామని తెలిపారు. బీజేపీ గెలిస్తే రైతుల పొలాలకు నీళ్లొస్తాయని, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.  


దద్దమ్మ కేసీఆర్‌  
పదిహేను నిమిషాలు సమయమిస్తే హిందువుల సంగతి చూస్తానన్న అక్బరుద్దీన్‌ ఓవైసీపై కేసు పెట్టని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్‌ది అని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్‌లో గుంతలులేని రోడ్డు ఒక్కటైనా చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.

డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఒక్కటి కూడా ఇవ్వని టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలో ప్రజలే ఆలోచించాలని కోరారు. బీజేపీ నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్‌ అభివృద్ధి బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు. కేవైఎఫ్‌ అధ్యక్షుడు రాంచందర్‌యాదవ్‌ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా జూపల్లి కృష్ణారావు పాలనలో కొల్లాపూర్‌ మరింత వెనకబడి పోయిందన్నారు.

ఈసారి ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ సభలో సభలో నాయకులు జలాల్‌ శివుడు, సందు రమేష్, శేఖర్‌గౌడ్, రామకృష్ణగౌడ్, కేతూరి బుడ్డన్న, నారాయణ, తిరుపతి బాలన్న, జాం పెద్దయ్య, శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు