అన్నారం, సుందిళ్ల సామర్థ్యం పెంపు!

4 Jul, 2016 04:27 IST|Sakshi

మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య ఎక్కువ నీటి నిల్వకు సర్కారు యోచన
అన్నారం సామర్థ్యం 11.77 టీఎంసీలకు..
సుందిళ్ల సామర్థ్యం 5.46 టీఎంసీలకు పెంచేలా కసరత్తు
8 టీఎంసీల మేరకు పెరగనున్న సామర్థ్యం
మల్లన్నసాగర్ ఆలస్యమయ్యే పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం
బ్యారేజీల స్థల మార్పుపై క్షేత్ర స్థాయిలో ఇంజనీర్ల అధ్యయనం

 
సాక్షి, హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లీ మార్పుచేర్పులు మొదలయ్యాయి. ప్రాజెక్టు పరిధిలో అత్యంత కీలకమని భావిస్తున్న మల్లన్నసాగర్ రిజ ర్వాయర్ పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యతో నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అదనపు నీటి నిల్వకు వీలుగా ఎగువన ఉన్న బ్యారేజీల సామర్థ్యం పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. గోదావరి ప్రవాహపు మార్గంలో మేడిగడ్డ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య ఉండే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సామర్థ్యాన్ని పెంచేలా కసరత్తు మొదలు పెట్టింది.
 
 8 టీఎంసీల మేర పెరగనున్న సామర్థ్యం..
 గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని మేడిగడ్డ బ్యారేజీ ద్వారా మళ్లించి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఖరారైన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీని 101 మీటర్ల ఎత్తులో 19.73 టీఎంసీల సామర్థ్యంతో.. అన్నారం బ్యారేజీని 122 మీటర్ల ఎత్తులో 6.22 టీఎంసీల సామర్థ్యంతో.. సుందిళ్లను 131 మీటర్ల ఎత్తులో 2.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేలా ప్రణాళికలు ఖరారయ్యాయి. బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణానికి రూ.13,811 కోట్లతో టెండర్లను సైతం ఖరారు చేశారు.
 
ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే 50 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన మల్లన్నసాగర్ భూసేకరణ అంశం వివాదాస్పదమైంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నిర్ణీత గడవులోగా మల్లన్నసాగర్ పూర్తి చే యడం కష్టమని, ఒకవేళ ప్రాజెక్టును పాక్షికంగా పూర్తి చేసినా, 50 టీఎంసీల నిల్వకు అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా నిల్వ చేసి, తరలించుకునేందుకు వీలుగా అన్నారం, సుందిళ్ల సామర్థ్యాలను పెంచాలని యోచిస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. అన్నారం ఎత్తును 124 మీటర్లకు పెంచి సామర్థ్యాన్ని 11.77 టీఎంసీలకు పెంచాలని, సుందిళ్ల ఎత్తును 134 మీటర్లకు, సామర్థ్యం 5.46 టీఎంసీలకు పెంచే అవకాశాలున్నాయి.
 
 దీంతో సుమారు 8 టీఎంసీల సామర్థ్యం పెరుగుతుంది. ఇక అన్నారం బ్యారేజీ కింద 607 హెక్టార్లు, సుందిళ్ల కింద 218 హెక్టార్ల మేర ముంపునకు గురవుతోంది. అన్నారం కింద పరిహారానికి రూ.192 కోట్లు, సుందిళ్ల కింద పరిహారానికి రూ.82 కోట్ల మేర ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ముంపును తగ్గిస్తూ, అదే ప్రవాహపు దారిలో ఎక్కువ నీటిని నిల్వ చేసే అనువైన ప్రాంతాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. అది జరిగితే బ్యారేజీల ప్రతిపాదిత స్థలాల మార్పు అనివార్యమవుతుంది.
 
 మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ‘కన్నెపల్లి’ గుర్తింపు..
 బ్యారేజీల నిర్మాణాలకు అనువైన స్థలాలను గుర్తించాలని భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఆదేశాల నేపథ్యంలో ఆదివారం ఈఎన్‌సీ మురళీధర్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, సీడీవో సీఈ నరేందర్‌రెడ్డి తదితరులు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి కన్నెపల్లి అనువైనదిగా గుర్తించారు. అన్నారం, సుందిళ్ల కోసం సైతం స్థల పరిశీలన చేశారు. రెండు, మూడు రోజుల్లో అనువైన స్థలాన్ని ఖరారు చేయనున్నారు. ఇక ప్రాజెక్టుకు అవసరమైన పంపులు, మోటార్ల కోసం డీఈ నర్సింగరావు, జెన్‌కో ఏడీఈ ఉపేందర్ భోపాల్ వెళ్లి పరిశీలన చేసి వచ్చారు.

మరిన్ని వార్తలు