మనసు మాట విందాం!

13 Apr, 2020 04:22 IST|Sakshi

లాక్‌డౌన్‌ లైఫ్‌ లెస్సన్స్‌..

సానుకూల దృక్పథమే అన్నిటికీ మందు

అనవసర భయాందోళనలతో అనర్థం

మంచి ఆలోచనలతోనే మానసిక ఆరోగ్యం

ప్రముఖుల రచనలు చెబుతున్నదిదే..

సాక్షి, హైదరాబాద్‌: ‘ఖాళీ బుర్ర దెయ్యాల కొంప’ అని నానుడి. కరోనా విపత్తు వేళ అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు ఈ ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా మలచుకుంటుంటే.. పలువురు భవిష్యత్తుపై బెంగతో దిగులు చెందుతున్నారు. ఒకపక్క మహమ్మారిపై భయాందోళనలు.. మరోపక్క రేపటి గురించి చింత మనిషిని నిస్పృహలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా యోగ, ధ్యానం, పుస్తక పఠనం, ఇతరత్రా వ్యాపకాలతో సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలని, ఆలోచనల్ని నియంత్రించుకోవడం ఈ సమయంలో కీలకమని ప్రపంచ ప్రసిద్ధ రచనలు చెబుతున్నాయి. కొందరు ప్రసిద్ధ రచయితలు తమ పాపులర్‌ రచనల్లో ఏం చెప్పారంటే..

ఆలోచనల్లోనే ఆ ‘సీక్రెట్‌’..
‘చిన్నారులు ఎంత చలాకీగా, ఎంత స్వచ్ఛంగా ఉంటారో, చింతలు, చికాకులు లేకుండా ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారో అంత  ఉత్సాహంగా ఉండగలగడమే నిజమైన ఆరోగ్యం’ – రోండాబర్న్, ‘ది సీక్రెట్‌’ రచయిత్రి

మనసులో దేన్నైతే నమ్ముతామో..అదే అవుతుంది. భగవద్గీత చెప్పేది కూడా అదే– ‘నువ్వు ఏమని భావిస్తావో అదే అవుతావు’ అని. అందుకే ఆరోగ్యం, వికాసం కోసం మంచి ఆలోచనలు చేయాలి. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేలా ఆలోచనల్ని మలచుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యంపై అనవసర భయాలు వదిలేయాలి. ‘నేను బాగున్నాను’ అనే భావన మనిషిని శక్తిమంతం చేస్తుంది. ‘ది సీక్రెట్‌’ పుస్తకమంతా ఈ ఆరోగ్యకరమైన ఆలోచనా రహస్యాలనే చెబుతుంది.

మైండ్‌ ‘పవర్‌’ ఎంతో తెలుసా?
‘భయం స్థానంలో ధైర్యాన్ని, అనారోగ్యం స్థానంలో ఆరోగ్యాన్ని, నిరాశ స్థానంలో ఆశావహ దృక్పథాన్ని నింపుకోవాలి. ‘నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా’ననే భావన మంచి ఆరోగ్యాన్నిస్తుంది’ – జోసెఫ్‌ మర్ఫీ, ‘ది పవర్‌ ఆఫ్‌ యువర్‌ సబ్‌కాన్షియస్‌ మైండ్‌’ రచయిత

మనలో సానుకూల ఆలోచనా ధోరణి పెరగాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలని, అదే సమయంలో కుటుంబసభ్యుల్ని, బంధుమిత్రుల్ని, సమాజాన్ని ప్రేమించాలని, మనకు సేవలందిస్తున్న వారిపై కృతజ్ఞత కలిగి ఉండాలంటాడు రచయిత జోసెఫ్‌ మర్ఫీ. ‘ఆందోళనలు, అనారోగ్యాలు సహజం. అయితే వాటిని అధిగమిస్తాన’నే భావన మంచి చేస్తుందని వివరిస్తాడు. ఈ మాటలు ఈ సమయంలో ఆచరణీయమని మానసిక నిపుణుడు వీరేందర్‌ అంటున్నారు. ఈ ఖాళీ సమయంలో బంధుమిత్రులు, సన్నిహితులతో కొత్త సంబంధాలు ఏర్పర్చుకోవచ్చని, జీవితంలో సాయపడ్డ గురువులు, శ్రేయోభిలాషులను ఫోన్‌లో పలకరించి కృతజ్ఞతలు చెప్పవచ్చని, కొత్త స్నేహాలకు శ్రీకారం చుట్టొచ్చని చెబుతున్నారు.

విజయానికి కొత్తదారి..
‘అవరోధాలే భవిష్యత్తుకు నిచ్చెనలు. కష్టాలు, సమస్యలు ఎదురైతే భయపడకుండా కొత్త దారి వెతుక్కోవాలి. జీవితాన్ని మరింత ఆనందంగా, ఆర్థికంగా మలచుకునేందుకు దీనినో అవకాశంగా భావించాలి. ఈ ఆలోచనా ధోరణి సంతోషాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంది’ – ‘రోడ్‌ టు సక్సెస్‌’లో నెపోలియన్‌ హిల్‌

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఉ ద్యోగాలు పోతాయని, జీతాల్లో కోతలుంటాయనే భయాందోళనలు నెలకొంటున్నాయి. ప్రజల్లో అభద్రతభావం పెరుగుతోంది. ఇలాంటి క్లిష్ట స మయంలోనే మనిషి తానేం టో నిరూపించుకోవాలని, తీ వ్ర శ్రమ, ఉన్నత వ్యక్తిత్వం, సానుకూల ఆలోచనలు, సరైన ప్రణాళికలు, మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాల ని పై పుస్తకం చెబుతోంది. క్రమబద్ధమైన ఆలోచనలు, ప్రయత్నాలు, కొత్త ఆశలు, ప్రార్థనలు విజయతీరాలకు చేరుస్తాయి. ఇందుకోసం సానుకూల భావాలతో ఉండటమే మార్గం. ఈ పుస్తకంలోని ఉన్నత వ్యక్తిత్వాలను చదివి ప్రపంచవ్యాప్తంగా ఎందరో స్ఫూర్తిపొందారని మానసిక నిపుణుడు వీరేందర్‌ అంటున్నారు.

చింత వీడితే ఆనందమే అంతా..
‘వివేకవంతునికి ప్రతిరోజూ కొత్త జీవితమే. ఈ రోజును నేను ఎంతో ఉత్సాహంగా, ఉన్నతంగా మలచుకుంటా. ఆ రోజున ఆరోగ్యంగా ఉంటా, తెలివిగా వ్యవహరిస్తా, నా కలలను నెరవేర్చుకుంటా’ – డేల్‌ కార్నెగీ,  ‘హౌ టు స్టాప్‌ వర్రీయింగ్‌ అండ్‌ స్టార్ట్‌ లివింగ్‌’ రచయిత

‘నాకు ప్రతిరోజూ కొత్త జీవితమే.. ఈ విధంగా రోజూ ఉదయాన్నే సంకల్పాన్ని తీసుకోవాలి. మనలోని ఆందోళనకు మూలమేమిటో కచ్చితంగా కనుక్కోవాలి. అప్పుడు పరిష్కారం గురించి ఆలోచించి అమల్లో పెట్టాలి. సమస్యేమిటో తెలిస్తే సగం రోగం నయమైనట్టే’ అంటారు రచయిత డేల్‌ కార్నెగీ. మానసిక ఆందోళన నుంచి బయట పడటానికి నిత్యం ఏదో పనిలో నిమగ్నం కావాలని, కొత్త వ్యాపకాలు కల్పించుకోవాలని చెబుతారు. డేల్‌ కార్నెగీ చెప్పినట్టే.. ప్రస్తుత పరిస్థితులను యథాతథంగా తీసుకొని, కొత్త జీవితాన్ని ఆస్వాదించడమే మన ముందున్న మార్గమని ప్రముఖ మానసిక నిపుణుడు వీరేందర్‌ అంటున్నారు.

మరిన్ని వార్తలు