పగోడికీ ఈ కష్టమొద్దు! 

16 May, 2020 03:43 IST|Sakshi

పనిలేక పస్తులున్నం... చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడ్డం

అక్కడ ఉండలేక.. ఇంటికి రాలేక నరకం చూసినం ∙వలస కూలీల దీనగాథలెన్నో...

అష్టకష్టాలు పడి సొంతూరికి చేరిన పలువురు వలస కార్మికులు

ఇక ఎక్కడికీ పోయేది లేదని.. చావైనా, బతుకైనా ఇక్కడేనని వెల్లడి

ఊళ్లో పని లేకపోవడంతో వారంతా పొట్ట చేతబట్టుకుని వందల కిలోమీటర్ల దూరం వలస వెళ్లారు. అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ, దొరికింది తింటూ ఇరుకు గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి సమయంలో వచ్చిన కరోనా మహమ్మారి వారి బతుకులను దుర్భరం చేసింది. చేసేందుకు పనిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. తినడానికి తిండి లేక నానాపాట్లూ పడ్డారు. పస్తులతో అక్కడ ఉండలేక.. ఇంటికి వెళ్లే పరిస్థితి లేక నరకం చవిచూశారు. కొంతమంది సాహసించి కాలినడకన సొంతూళ్లకు పయనమవ్వగా.. మరికొందరు అప్పులు చేసి, వేలకు వేలు కారు కిరాయి కట్టుకుని బతుకుజీవుడా అంటూ ఇళ్లకు చేరారు. లాక్‌డౌన్‌ సమయంలో తాము పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావని వాపోయారు. ఇలాంటి కష్టాలు పగోడికి కూడా రావొద్దని దండాలు పెట్టారు. ఇవీ తెలంగాణ నుంచి మహారాçష్ట్ర వలస వెళ్లినవారి వ్యథాభరిత గాథలు. ఇక కలో గంజో తాగి సొంతూళ్లేనే ఉంటామని, మళ్లీ వలస పోయేది లేదని చెబుతున్నారు.

పిల్లలకు అటుకులు.. మాకు నీళ్లు.. 
ఊళ్లోనే వ్యవసాయం చేసుకుందామని బోర్లు వేసిన. కానీ నీళ్లు రాలే. ఇక బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతోపాటు అన్న కొడుకు, అక్క కొడుకుతో కలిసి 20 ఏళ్ల క్రితం ముంబై పోయిన. అక్కడి బోరువెల్లి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నం. పిల్లలిద్దరూ చదువుకుంటుండగా.. మేం నలుగురం ఇళ్లలో పనిచేయడం, కూలిపనులకు వెళ్లడం చేసెటోళ్లం. కరోనా రావడంతో మా బతుకు దుర్భరంగా మారిపోయింది. కరోనా వైరస్‌తో ముంబైలో కేసులు పెరగడం, మేమున్న దిక్కునే ఎక్కువ కావడంతో రెడ్‌జోన్‌ చేసిండ్రు. యజమానులు ఇళ్లలో పని బంద్‌ చేసిండ్రు. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చె.  పని  లేకుండా పాయె. అందరం పస్తులుండాల్సి వచ్చింది. మనసున్నోళ్లు తెచ్చిచ్చే పొట్లాలే మాకు ఆహారం అయ్యాయి. తిండి ఎప్పుడు దొరుకుతదోనని ఎదురు చూడాల్సి వచ్చింది.

ఎవ్వరు ఏమీ తేకపోతే గారోజు పిల్లలకు అటుకులు పెట్టి మేం మంచినీళ్లు తాగి పడుకునేటోళ్లం.. ఇంటికాడ ఉన్న మా అవ్వా, అయ్య ఫోన్‌ చేసి ఏడ్వవట్టె.. అక్కడ మేం.. ఇక్కడ వాళ్లు ఏడ్చుడే తప్ప ఏం జెయ్యలేని పరిస్థితి.. ప్రధాని సారు ఎవ్వరి ఊరికి వాళ్లు పోవచ్చు అని చెప్పడంతో బతుకు జీవుడా అనుకున్నాం. ఏదైనా పెద్ద బండి కిరాయికి తీసుకుని వద్దామంటే మనిషికి రూ.7వేలు అడిగిండ్రు.. గన్ని పైసలు మా కాడ లేవు. మా రెండు మోటార్‌ సైకిళ్లు ఉంటే ఒక్కొక్క బండిపై ముగ్గురం లెక్క ఆరుగురం బయలుదేరినం. పోలీసోళ్లు ఆపితే బతిమాలుకున్నాం. నీళ్లు ఉన్న తావు కాడ ఆపి అటుకులు, అరటిపండ్లు తింటూ.. అలసిపోయిన కాడ కొద్దిసేపు ఆపి.. బయలుదేరి 3 రోజులకు మా ఊరికి చేరినం..  కూలో నాలో చేసుకొని ఇక్కడే బతుకుతాం.. ఇక ఏ ఊరుకు పోయేది లేదు.
– భూంపల్లి స్వామి, మహ్మద్‌షాపూర్, దౌల్తాబాద్‌ మండలం, సిద్దిపేట జిల్లా 

ముంబై నుంచి మహ్మద్‌షాపూర్‌కు వచ్చిన భూంపల్లి స్వామి కుటుంబ సభ్యులు

ఇంటికొస్తమనుకోలేదు..! 
ముంబైలోని థానా జిల్లా దేశయ్‌నాక్‌లోని కల్లు దుకాణంలో పనిచేసేది. కరోనా వచ్చిందని ముంబై అంతా బంద్‌ చేసిండ్రు. మళ్లీ దుకాణాలు చాలు ఐతయ్‌ కదా.. ఇంకొన్ని రోజులు పనిచేసి, నాలుగు పైసలు ఎనుకేసుకుందామని ఆశతో అక్కడే ఉన్న. పెద్దబిడ్డ పెళ్లికి అప్పు చేసిన పైసలన్నా తేర్పాలే అనుకున్న. లాక్‌డౌన్‌తో రోజు చాలీచాలని తిండి తినుకుంటూ, భయంతో రూంలనే ఉన్నాం.  ఏమన్న ఐతే భార్య, పిల్లల గతి ఎట్ల అని అనిపించినప్పుడల్లా కండ్లళ్ల నీళ్లు తిరుగుడు. ఎట్లైనా ఇంటికి పోవాలె అని సేటుకు చెప్పడంతో పర్మిషన్‌ లెటర్‌ తీసుకున్నడు. కారులో తీసుకువచ్చి ఇంటికి చేర్చిండు.. అసలు ఇంటికొస్తమనుకోలేదు. ఇక ఇక్కడనే ఉండి సెంట్రింగ్‌ పనిచేసుకుంట. అచ్చినకాడికయే పైసలు..భార్యాపిల్లలను చూసుకుంటూ పుట్టిన ఊరులోనే ఉంటా. – ఉప్పరి అశోక్, మల్యాల, జగిత్యాల జిల్లా

బతుకెట్లా దేవుడా? 
ముంబైలోని విలేపార్లే ఏరియాలో నేను, నా భర్త, కొడుకు ఇళ్లలో బోల్లు తోముకుంటూ అద్దెకు ఉంటూ బతికాం. కరోనాతో రెండు నెలల నుంచి అక్కడ పనులు లేవు. ఇళ్లలోనే ఉన్నాం. డబ్బులు లేకపోవడంతో చాలా ఇబ్బందైంది. నేను మా అల్లుడు కారులో ఒక్కదాన్ని వచ్చాను. భర్త, కుమారుడు అక్కడే ఉన్నారు. ముగ్గురికి నెలకు పదిహేడు వేలు వచ్చేవి. అందులో ఏడు వేలు ఇంటి అద్దె పోను మిగిలినవి తిండి ఖర్చులకు ఉండేవి. ఏమి మిగిలేవి కావు. మా కూతురు డెలివరీకి ఉండడంతో అక్కడ ఆసుపత్రిలో ఇబ్బంది ఉంటుందని పోలీసుల పర్మిషన్‌ లెటర్‌తో కారులో ముగ్గురం వచ్చాం. ఇంటికి చేరుకోగానే హోం క్వారంటైన్‌ చేశారు. చేతిలో రూపాయి లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఆదుకొని సాయం చేయాలి. – గుమ్ముల లక్ష్మి, జెండావెంకటాపూర్, మంచిర్యాల జిల్లా

ఇక ముంబైకి పోను.. 
20 ఏళ్ల క్రితం ముంబైకి వలస వెళ్లిన. అక్కడ బోరువెల్లి ప్రాంతంలో ధోబీ పనులు చేసేవాడిని. లాక్‌డౌన్‌ సమయంలో ముంబైలో నరకయాతన అనుభవించిన. 45 రోజుల పాటు పని లేదు. చిన్న ఇరుకు గదిలో పదిమందిమి ఉండెటోళ్లం. బియ్యం, కూరగాయలు కొనడానికి గంటపాటు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేవారు. లాక్‌డౌన్‌కు రెండ్రోజుల ముందే ఇంటికి డబ్బులు పంపించడంతో కొన్ని రోజుల తర్వాత నా దగ్గర చిల్లిగవ్వ లేకుండా పోయె. ఇంకా ఇంటికి డబ్బు పంపించని తోటి కార్మికులను బతిమాలి చేబదులుగా కొంత డబ్బు తీసుకున్నాను. అతికష్టమ్మీద ఊరు చేరిన. ఇక ముంబైకి పోను. ఇక్కడే వ్యవసాయ పనులు చేసుకుని బతుకుతాను.  – పోతుగంటి సత్తయ్య, అంచనూరు, దోమకొండ మండలం, కామారెడ్డి జిల్లా

700 కిలోమీటర్లు నడిచి ఇల్లు చేరిన.. 
కొన్నేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ఊళ్లో ఉపాధి లేకపోవడంతో ఇద్దరు కొడుకులతో కలిసి మహారాష్ట్రలోని నార్సింగిలో కూలీపనులు చేసుకుంటూ బతుకుతున్నం.  లాక్‌డౌన్‌తో అన్నీ మూసేయడంతో పనులు దొరకలేదు. ఇక చేసేదేమీ లేక కాలినడకన ఇంటికి బయలుదేరిన. దారిలో ఎవరూ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. వారంరోజులపాటు 700 కిలోమీటర్లు నడిచి ఇల్లు చేరిన. ఇక్కడ కూడా పనులు లేకపోవడంతో చాలా ఇబ్బంది అయితాంది. – గిత్త సాలమ్మ, తొర్రూరు, మహబూబాబాద్‌ జిల్లా

కాలినడకన 850 కిలోమీటర్లు.. 
నేను కొన్నేళ్లుగా భార్యాబిడ్డలతో కలిసి ముంబై సమీపంలోని థానేలో ఉంటూ మట్టి పనులు చేస్తుండేవాడిని. కరోనా వ్యాప్తి అధికమైందని.. ఇక్కడ ఎవరూ ఉండరాదని ఒకరికొకరు చెప్పుకోవటం, ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయన్న మాటలు విని భయపడ్డాను. పిల్లాపాపలతో కలిసి కాలినడకనైనా సొంతూరికి వెళ్దామని నిశ్చయించుకొని బయ ల్దేరాను. మా ఊరికి రోడ్డు మార్గంలో వెళితే 850 కిలోమీటర్లు ఉంటది. ఎర్రటి ఎండలో దారిపొడవునా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రైలు పట్టాలు, పొలాల వెంట నడుచుకుంటూ వచ్చాం. దాహం వేసినప్పుడల్లా మంచినీటికి అలమటించాం. దారి పొడవునా వచ్చే గ్రామాల్లో చేతుల్లో ఉన్న నీటి సీసాలను నింపుకుని బతుకుజీవుడా అంటూ ఎనిమిది రోజుల తర్వాత ఊరు చేరినం. – బాబునాయక్, కొత్తతండా, అమరచింత, వనపర్తి జిల్లా

మరిన్ని వార్తలు