మోమిన్‌పేటలో రియల్‌ అక్రమాలు

15 Dec, 2019 10:52 IST|Sakshi
మోమిన్‌పేటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెలిసిన వెంచర్‌

ప్రభుత్వ భూములను కబ్జాచేసి విక్రయం   

నిబంధనలకు నీళ్లు వదిలేసి వెంచర్ల నిర్మాణం   

సాక్షి, మోమిన్‌పేట: మోమిన్‌పేట మండల కేంద్రంలో అక్రమంగా వెలిసిన వెంచర్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్లాట్లు చేసి విక్రయించిన నిర్వాహకులు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. ఏ ఒక్క వెంచర్‌లోనూ పార్కు స్థలాలు, చెట్లు, విద్యుత్‌ సౌకర్యం, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మచ్చుకైనా కనిపించడం లేదు. ఇష్టారాజ్యంగా ప్లాట్లు చేయిస్తున్న అక్రమార్కులు యథేచ్ఛగా వీటిని విక్రయించి కోట్ల రూపాయలు దండుకున్నారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ భూములు, నక్షా రహదారులు, నాలా స్థలాలను కబ్జాచేసి విక్రయిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా నిరూపితమైనా సంబంధిత వ్యక్తులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.  

అనుమతులు ఉన్నాయంటూ.. 
వెంచర్లు ఏర్పాటు చేసిన రియల్టర్లు తమకు డీటీపీసీ అనుమతులు ఉన్నాయంటూ కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు. మండల కేంద్రంలో గత నాలుగేళ్లుగా ఐదు వెంచర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్క చోట కూడా పంచాయతీలకు పదిశాతం స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయలేదు. వెంచర్‌కు సంబంధించిన బ్రోచర్‌లో మాత్రం పార్కు కోసం వెంచర్‌ మధ్య భాగంలో స్థలం వదిలేసినట్లు చూపిస్తున్నారు. కానీ ఆ తర్వాత ఓ మూలన స్థలం ఇస్తామని చెప్పి అధికారులు, ప్రజాప్రతినిధులను మేనేజ్‌ చేస్తున్నారు.

ఆఖరుకు సెంటు జాగా కూడా వదలకుండా ప్లాట్లు చేసి అమ్మేసుకుంటున్నారు. మోమిన్‌పేటలో పలు వెంచర్లు ఏర్పాటు చేసి నా లుగేళ్లయినా.. ఇప్పటి వరకూ వీటిలో కనీసం ఒ క్క మొక్క కూడా నాటలేదంటే పరిస్థితి ఎంత దా రుణంగా ఉందో చెప్పనక్కర్లేదు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసి సొమ్ము చేసుకుంటు న్న వారిపట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతోనే వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోందని స్థానికులు మండిపడుతున్నారు.   

ప్రభుత్వ భూమి స్వాహా... 
మోమిన్‌పేటలోని 234 సర్వేనంబరులో ఉన్న 8.15 ఎకరాల భూమిలో నాలుగేళ్ల క్రితం వైష్ణవి వెంచర్‌ను ఏర్పాటు చేశారు. 8 ఎనిమిది ఎకరాల పట్టా స్థలంతో పాటు దీని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఇందులో కలిపేసి విక్రయించారు. 233 సర్వేనంబర్‌లోని 15 గుంటల సర్కారు భూమిని ఆక్రమించిన నిర్వాహకులు దర్జాగా పాట్లు నిర్మించి సొమ్ము చేసుకున్నారు. దీని విలువ రూ.కోటి వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అప్పటి ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల సహకారంతో ఈ తతంగం నడిపారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందడంతో.. దీనిపై తహసీల్దార్‌ విచారణకు ఆదేశించారు.

కొద్ది రోజుల క్రితం వైష్ణవి వెంచర్‌ను సర్వే చేసిన ఆ విభాగం అధికారులు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని నిర్ధారించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిసిన బాధితులు లబోదిబోమంటున్నారు. ప్లాటు విక్రయించి తమ కూతురు వివాహం చేద్దామనుకున్నామని కొంతమంది, తమ కొడుకు ఉన్నత చదువుల కోసం అమ్ముకోవచ్చనే ముందుచూపుతో.. పైసాపైసా పోగుచేసి ప్లాటు కొన్నామని మరికొంతమంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై నిర్వాహకులను అడిగితే తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.   

వాగులోకి సెప్టిక్‌ ట్యాంక్‌ కనెక్షన్‌..  
మోమిన్‌పేట– సదాశివపేట మార్గంలో ఇటీవల ఓ వెంచర్‌ నిర్మిస్తున్నారు. 12 ఎకరాల స్థలంలో ప్లాట్లు సిద్ధం చేస్తున్నారు. అయితే వెంచర్‌లో నిర్మించిన సెప్టిక్‌ ట్యాంకును 50 అడుగుల దూరంలో ఉన్న నందివాగు ప్రాజెక్టులో కలిపేశారు. అంతేకాకుండా తాతల కాలం నుంచి ఉన్న నక్షా రహదారిని కలిపేసుకుని.. తమ వెంచర్‌కు 40 ఫీట్ల రోడ్డుగా మార్చారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వెంచర్‌ నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా