చెంచాగిరీ చేస్తున్నారు: జగ్గారెడ్డి

14 Nov, 2019 11:47 IST|Sakshi

ఉద్యోగ సంఘాలు కార్మికుల పక్షాన నిలబడాలి: జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు దురదృష్టకరం

ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆత్మహత్యలుండవని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో చెప్పారని, కానీ అందుకు విరుద్ధంగా పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒకవైపు రైతులు, మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె 40 రోజులు జరగడం ఇదే తొలిసారి అని, ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు.

ఉద్యమాలకు రాష్ట్రంలో విలువ లేకుండా పోయిందన్న జగ్గారెడ్డి.. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. ఇంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు. బలవంతుడికి, బలహీనుడికి జరుగుతున్న పోరాటంలో భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో అని వ్యాఖ్యానించారు. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు కూడా కేసీఆర్‌ మాటలను బలపరుస్తూ ప్రభుత్వానికి చెంచాగిరీ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్వామిగౌడ్, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, మమత, రవీందర్‌రెడ్డిలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. టీజీవో, టీఎన్జీవో సంఘాలు ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి వారికి మనోస్థైర్యం కల్పించాలని ఆయన సూచించారు.   

మరిన్ని వార్తలు