ఆదుకోరూ..

28 May, 2020 11:11 IST|Sakshi
మతిస్థిమితంలేని కొడుకుతో తల్లి, అనారోగ్యంతో ఉన్న దీపకు సేవ చేస్తున్న తల్లి

అనారోగ్యంతో కూతురు, కొడుకు

వైద్యం చేయించలేక ఇబ్బందులు పడుతున్న పేద తల్లిదండ్రులు

వరంగల్‌, ఆత్మకూరు : చేతికొచ్చిన కూతురు, కుమారుడు అనారోగ్యం బారినపడడంతో కన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. జీర్ణకోశ, కాలేయ, మూత్రపిండాల వ్యాధితో కుమార్తె ఏడేళ్లుగా బాధపడుతోంది. దీనికితోడు రెండేళ్ల క్రితం కొడుకు మతిస్థిమితం కోల్పోయాడు. వారి దీనస్థితిని చూస్తు తల్లిదండ్రులు కన్నీరు కార్చని రోజు లేదు. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం కామారం గ్రామానికి చెందిన నర్మేటి సుధాకర్‌–కవిత దంపతులకు కుమార్తె దీప ఉంది. ఈమె వయసు ఇప్పుడు 20 ఏళ్లు, కుమారుడు రంజిత్‌ వయసు 21 ఏళ్లు. గీతకార్మికుడి వృత్తిపై సుధాకర్‌ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చాలీచాలని ఆదాయంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఏడేళ్ల క్రితం కూతురు దీప అనారోగ్యానికి గురైంది.

వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. రూ.10లక్షల వరకు అప్పుచేసి వైద్యం చేయించినా ఫలితం కానరాలేదు. జీర్ణకోశ, కాలేయ, మూత్రపిండాల వ్యాధులతో దీప మంచానికే పరిమితమైంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మెరుగైన వైద్యం చేయించలేక తల్లడిల్లిపోతున్న ఆ తల్లిదండ్రులకు కుమారుడు రంజిత్‌ అనారోగ్య పరిస్థితి పిడుగుపాటుగా పరిణమించింది. అతడు రెండేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు. ఎదిగిన పిల్లలు ఇలా అనారోగ్యంతో ఉండడంతో దిక్కుతోచక కన్నవారు కన్నీటిపర్యంతమవుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకున్న వారు

మెరుగైన వైద్యం చేయించే శక్తిలేదు..
చేతికందిన బిడ్డ, కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగాము. హైదరాబాద్‌లో చూపిస్తే ఆపరేషన్లు చేయాలే అంటున్నారు. అందుకు డబ్బులు బాగా అయితాయని చెప్పారు. పూటగడవడానికే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఖరీదైన వైద్యం చేయించలేక పోతున్నాం. 7569411059 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించగలరు. దయగలవారు ఆదుకుని తమ పిల్లలను కాపాడాలని చేతులెత్తి మొక్కుతున్నాము.– నర్మేటి కవిత–సుధాకర్‌

మరిన్ని వార్తలు