తండ్రి మందలించాడని..

29 Jul, 2015 00:01 IST|Sakshi

రైలుకింద పడి కుమారుడి ఆత్మహత్య   
చదువు మాన్పించడంతో మనస్తాపం
 
  ఒకవైపు ఆ విద్యార్థి పైచదువులు అభ్యసించాలనుకున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు.. దీంతో పదో తరగతి వరకే చదవగలిగాడు.. మరోవైపు సంతలో సరుకులు తెచ్చేందుకు ఇంట్లో దాచిన డబ్బులు తీసుకున్నాడని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కొడుకు చివరకు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ సంఘటన తాండూరు ైరె ల్వే అవుట్‌పోస్ట్ పరిధిలో మంగళవారం  మధ్యాహ్నం చోటు చేసుకుంది.
 
  బషీరాబాద్ : మండలంలోని కొర్విచెడ్‌గనికి చెందిన టోప్యానాయక్, గోపీబాయి దంపతులకు కుమారుడు కిషన్ అలియాస్ కృష్ణ (17), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తలు సమీపంలోని నాపరాతి గనుల్లో కూలీలుగా పనిచేస్తూ పిల్లలను పోషిస్తున్నారు. కిషన్ బషీరాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో గత మార్చిలో పదోతరగతి వరకు చదివాడు. ఆర్థికస్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు పైచదువులు వద్దనడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇంట్లో దాచి ఉంచిన రూ.500లను తీసుకున్నాడు. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న తండ్రి ఎందుకు తీసుకున్నావని కొడుకుతో గొడవపడ్డాడు.

అనంతరం తల్లిదండ్రులు బషీరాబాద్‌లో జరిగే సంతోలో వారానికి సరిపడా సరుకులను తీసుకొచ్చేందుకు వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన కిషన్ ఇక నేను బతికి ప్రయోజనం లేదు.. అంటూ ఇద్దరు చెల్లెళ్లకు చెప్పి సమీపంలో ఉన్న పట్టాల వైపునకు పరిగెత్తాడు. ఇది గమనించిన స్థానికులు, రైల్వే శాఖ ఉద్యోగి (కీమన్) పట్టుకునేందుకు యత్నించగారాళ్లు రువ్వాడు. అంతలోనే వేగంగా వస్తున్న గూడ్స్‌రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు