మంటగలిసిన మానవత్వం

10 Jul, 2020 11:09 IST|Sakshi
మ్యాన అమిత్‌ (ఫైల్‌) తంగళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో బాధిత కుటుంబసభ్యులు

కొడుకు మృతిచెందగా ఇంట్లోకి రావొద్దన్న ఇంటి యజమాని

మృతదేహం ఆసుపత్రి నుంచి నేరుగా శ్మశానవాటికకు తరలింపు

నెలరోజులు అద్దె ఇంట్లోకి నిషేధం, పాఠశాలలో తలదాచుకున్న వైనం  

గుండెపోటుతో మ్యాన అమిత్‌ మృతి

దీనస్థితిపై చలించిన పోలీసులు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): సభ్యసమాజం తలదించుకునేలా మానవత్వం మంటకలిసింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లిలోని రెడ్డివాడలో అద్దె ఇంట్లో నివాసముంటున్న మ్యాన అమిత్‌ (27) గురువారం ఉదయం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తే ఇళ్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని అనుమతించలేదు. గత్యంతరం లేక అమిత్‌ కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా తంగళ్లపల్లి ఊరి చివరికి శ్మశానం వద్దకు మృతదేహాన్ని తరలించారు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం మ్యాన అమిత్‌ తండ్రి సుదర్శన్‌ గతంలో మృతిచెందగా తల్లి సువర్ణతోపాటు తన సోదరులతో కలిసి మండలకేంద్రంలో ఓ ఇంట్లో పదినెలలుగా అద్దెకు ఉంటున్నారు.

టెక్స్‌టైల్‌ పార్కులో మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి మ్యాన సువర్ణ బీడీల పనిచేస్తోంది. గురువారం తెల్లవారుజామున అమిత్‌ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో ఆరోగ్యం అతడిని హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే అమిత్‌ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు దహనసంస్కారాలు నిర్వహించేందుకు తంగళ్లపల్లి అద్దె ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఇంటి యజమాని ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆటోలో తంగళ్లపల్లి ఊరిచివర శ్మశానవాటిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచే అమిత్‌కు అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చింది. గూడు లేని పక్షులవలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలా మందిని కంటతడి పెట్టించింది. అమిత్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూత అందించాలని అంతేకాకుండా ఉండడానికి గూడు కల్పించాలని తంగళ్లపల్లివాసులు కోరుతున్నారు. 

చలించిపోయిన పోలీసులు
అక్కడే మానేరు వాగు ఒడ్డున పికెటింగ్‌ నిర్వహిస్తున్న సీఐ సర్వర్, పోలీస్‌ సిబ్బంది అమిత్‌ కుటుంబసభ్యుల పరిస్థితి చూసి చలించిపోయారు. సీఐ సర్వర్‌ రూ.10 వేలు, పోలీస్‌ సిబ్బంది అందరూ కలిసి మరో రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు.

మరిన్ని వార్తలు