వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి 

7 May, 2020 00:31 IST|Sakshi
రేకుల ఇంటి వద్ద ఆనందం, భార్య, కొడుకు (ఫైల్‌)

సాక్షి, కోనరావుపేట (వేములవాడ): సర్పంచ్‌ అయితేనే లక్షలు సంపాదించుకునే రోజులివి. ఎమ్మెల్యే అయితే తరాలు కూర్చొని తిన్నా.. తరగని ఆస్తి కూడబెట్టుకునే కాలమిది. అలాకాకుండా ప్రజాసేవే పరమావధిగా సాదాసీదా జీవనం సాగించిన ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు అనారోగ్యంతో మంచాన పడి.. చేతిలో చిల్లిగవ్వలేక.. వైద్యం అందక బుధవారం మృతిచెందాడు. చిన్నపాటి రేకులషెడ్డులో ఉంటూ ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కర్రెల్ల నర్సయ్య స్వాతంత్య్ర సమరయోధుడు.

1957–62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాసేవకే అంకితమై ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. 15 ఏళ్ల కింద నర్సయ్య కన్నుమూయగా, ఆయన కుటుంబం కడుపేదరికంలో బతుకుతోంది. నర్సయ్య కొడుకు ఆనందం (48) గ్రామంలోనే సుతారిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో కణతులున్నాయని వైద్యులు చెప్పడంతో రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. మరో రూ.లక్ష అవసరం కాగా, డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేదు. బుధవారం ఇంట్లోనే కన్నుమూశాడు. ఆయనకు భార్య అనిత, కొడుకులు లెనిన్, మధు ఉన్నారు.  

మరిన్ని వార్తలు