నగల కోసం అత్తను హతమార్చిన అల్లుడు

21 Jun, 2016 08:00 IST|Sakshi

నర్సాపూర్‌: నగల కోసం అత్తను అల్లుడు హతమార్చినట్లు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు, ఎస్సై వెంకటరాజుగౌడ్‌లు తెలిపారు. ఈనెల 18న మండలంలోని నాగులపల్లి పంచాయతీ పరిధిలోని తౌర్య తండాకు చెందిన గిరిజన మహిళ మెగావత్ తార(48)ని పట్టపగలే దారుణంగా హత్యచేసిన నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.  సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

హతురాలి కూతురు బుజ్జి భర్త ఇస్లావత్ జగదీష్, అతడి మిత్రుడు ఉమేష్ కలిసి పథకం ప్రకారమే అత్త ఒంటిపై ఉన్న నగలు, నగదు కోసం దారి కాచారు. నాగులపల్లి ఉన్న పాఠశాల సమీపంలోని కర్నాలకుంట వద్ద కల్లు సీసాతో గొంతు, ఇతర చోట్ల పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. మృతురాలు తార, విఠల్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు బుజ్జి ఉండడంతో ఆమెను అదే తండాకు చెందిన ఇస్లావత్ జగదీష్‌కు ఇచ్చి మూడేళ్ళ క్రితం పెళ్లి జరిపించినట్లు తెలిపారు.

పెళ్లైన కొన్ని రోజుల నుంచి జగదీష్ పనులేమీ చేయకుండా జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడన్నారు. మూడేళ్లలో మామ విఠల్, అత్త తారలు రెండు సార్లు అతడికి కొత్త బైక్ కొని ఇచ్చారు. అయితే వాటిని జల్సాల కోసం తక్కువ ధరకు విక్రయించడంతోపాటు తరుచూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడు. జల్సాలు మానుకొని ఏదైనా పని చేసుకోవాలని అత్త తార పలుమార్లు గట్టిగా చెప్పింది.

అది జీర్ణించుకోలేక అత్తను హతమారిస్తే ఇక తనకు తిరుగు ఉండదన్న ఉద్దేశంతో పథకం ప్రకారం హత్య చేశాడు. హత్య చేసిన సమయంలో ఆమె ఒంటిపై కాళ్ళ కడియాలు, పట్టాలు, కలిపి( 40 తులాల వెండి), అర్ధ తులం బంగారు కమ్మలు, రూ 16 వేల నగదు ఉండగా వాటిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. దీంతోపాటు అత్తను హత మారిస్తే తనుకు తిరుగుండకపోవడంతోపాటు అత్తామామల ఆస్తిని చేజిక్కించుకోవచ్చన్న అత్యాశతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరు నిందితుల నుంచి నగలు, నగదును రికవరీ చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో హెడ్‌కానిస్టేబుల్ రాజు, మధు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు