కన్నతండ్రినే వాహనంతో ఢీకొట్టి దారుణంగా హతమార్చాడు

26 Jul, 2018 13:03 IST|Sakshi

ఆస్తికోసం తనయుడి దురాగతం

నాలుగేళ్ల క్రితం అన్నను చంపిన నిందితుడు

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్‌లో ఘటన

తుర్కపల్లి(ఆలేరు) : మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తుల కోసం రక్తసంబంధాలు కూడా బలైపోతున్నాయి. ఇటీవల చౌటుప్పల్‌ సమీపంలో ఆస్తి కోసం కుమారుడిని హత్య చేయించిన మారు తల్లి ఘటనను మరవకముందే యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్‌ సమీపంలో ఓ ఘోరం జరిగింది. ఆస్తికోసం కన్నతండ్రినే టాటా సుమో వాహనంతో ఢీకొట్టి దారుణంగా చంపేశాడు. నిందితుడు పోలీసుల ఎదుటలొంగిపోయాడు. ఇతను నాలుగేళ్ల క్రితం అన్ననూ చంపాడు. తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంటతండాకు చెందిన ధరావత్‌ జాలం(68) అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సుగుణకు ఇద్దరు కుమారులు, చిన్నభార్య లక్ష్మికి ఓ కొడుకు నరేందర్‌నాయక్‌ ఉన్నాడు.

జాలానికి తండాలో 15 ఎకరాల భూమి ఉండగా అందులో మూడెకరాలు విక్రయించాడు. మిగిలిన భూమిని పెద్ద కొడుకు భిక్షపతి భార్య పేరుమీద కొంత, మరికొంత భూమిని భార్య సుగుణ పేరు మీద రిజిస్టర్‌ చేశాడు. చిన్న భార్య లక్ష్మి, అతని కుమారుడు నరేందర్‌నాయక్‌కి ఆస్తి ఇవ్వలేదు. దీంతో లక్ష్మి తనకుమారుడితో కలిసి తన తల్లిగారి ఊరైన జనగామ జిల్లా నర్మెట మండలం మలక్‌పేటతండాలో ఉంటూ జీవనం సాగిస్తోంది. ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని తండ్రి జాలం, మొదటి భార్య కొడుకుల మీద నరేందర్‌నాయక్‌ కసిపెంచుకున్నాడు. కాగా, నరేందర్‌నాయక్‌ తండ్రి జాలం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని ఆస్తిలో భాగం ఇవ్వలేదని తెలుస్తోంది.

నాలుగేళ్ల క్రితం అన్న హత్య
పెద్దభార్య కుమారుడు ధారవత్‌ నర్సింహనాయక్‌ తనకు ఆస్తి రాకుండా అడ్డు పడుతున్నాడని నరేందర్‌నాయక్, అతని బావమరిదితో కలిసి నాలుగేళ్ల క్రితం గొల్లగూడెం గ్రామశివారులో కత్తులతో దాడి చేసి చంపేశాడు.  

పక్కాప్లాన్‌ ప్రకారం..
నాలుగేళ్ల క్రితం అన్నను హత్య చేసిన నేరంలో భువనగిరి కోర్టు పేషీకి నరేందర్‌నాయక్‌ వచ్చి పోతున్నాడు. మంగళవారం కోర్టుకు వచ్చి తిరిగి వెళ్లిపోయాడు. తన లాయర్‌ను కలవడానికి బుధవారం కూడా కోర్టుకు వచ్చాడు. ఈ క్రమంలో మర్రికుంటతండా నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి జాలం పెద్దకొడుకు భిక్షపతితో కలిసి వేర్వేరు బండ్ల మీద భువనగిరికి వచ్చారు. నరేందర్‌నాయక్‌ తండ్రి జాలంను చూసి వెంబడించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. జాలం ఆస్పత్రినుంచి తిరిగి తన టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై ఇంటికి వెళ్తుండగా రుస్తాపూర్‌ సమీపంలోకి రాగానే వెనకనుంచి టాటా సుమో వాహనంతో బలంగా ఢీకొట్టడంతో జాలం రోడ్డుపైన పడిపోయాడు. తిరిగి చనిపోయాడో లేదో అని మళ్లీ టాటా సుమోను వెనక్కి మలిపి ఢీకొట్టినట్లు బంధువులు పేర్కొంటున్నారు. జాలం చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత టాటా సుమోతో సహా తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసాచార్యులు, గుట్ట సీఐ ఆంజనేయులు, ఇన్‌స్పెక్టర్‌ ఆశోక్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశం హెడ్‌కానిస్టేబుల్స్‌ నర్సింహనాయుడు, వెంకటేశ్వర్లు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు